EPF Advance Claim Limit :ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతున్న సొమ్ము రిటైర్మెంట్ కోసం ఉద్దేశించినదైనా, ఎమర్జెన్సీ పరిస్థితుల నేపథ్యంలో చందాదారులు పాక్షికంగా విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని ఈపీఎఫ్ఓ సంస్థ ఇస్తోంది. విద్య, వైద్యం, వివాహం, ఇంటి నిర్మాణం ఇలా పలు సందర్భాల్లో ఈపీఎఫ్ ఖాతా నుంచి కొంత మొత్తం నగదును అడ్వాన్స్‌గా విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే దీనికి కొన్ని లిమిట్స్ ఉంటాయి. తాజాగా నగదు విత్‌డ్రా పరిమితుల్లో ఈపీఎఫ్‌వో కీలక మార్పులు తెచ్చింది. వైద్య ఖర్చుల కోసం చేసుకునే ఆటో క్లెయిమ్ పరిమితిని ఈపీఎఫ్‌ఓ రెట్టింపు చేసింది.
వైద్య ఖర్చుల కోసం చేసుకునే ఆటో క్లైయిమ్ లిమిట్‌ను పెంచుతున్నట్లు ఈపీఎఫ్‌ఓ ఓ సర్క్యులర్ విడుదల చేసింది. పేరా 68J కింద ఆటో క్లెయిమ్ సెటిల్‌మెంట్ లిమిట్‌ను రూ.50 వేల నుంచి రూ.1లక్ష వరకు పెంచుతున్నట్లు సర్క్యులర్‌లో పేర్కొంది. 'పీఎఫ్ ఖాతా ఉన్నవారు తమ వ్యక్తిగత లేదా కుటుంబసభ్యుల వైద్య ఖర్చుల కోసం 68J పేరా కింద ఈపీఎఫ్ డబ్బులను విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది.
కండిషన్స్ అప్లై
నెల రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజుల పాటు ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, సర్జరీలు చేయించుకున్నా ఈపీఎఫ్ నుంచి డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. టీబీ, క్షయ, పక్షవాతం, క్యాన్సర్, గుండె చికిత్సల కోసం అడ్వాన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్లు లేకుండానే సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించి క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే ఉద్యోగి 6 నెలల బేసిక్ సాలరీ + డీఏ లేదా జమ అయిన మొత్తంలో ఉద్యోగి వాటా (వడ్డీ సహా) ఈ రెండింటిలో ఏది తక్కువైతే అంత వరకు మాత్రమే విత్‌డ్రా చేసుకోవడానికి వీలుంది. అంతేకాకుండా దివ్యాంగులైన ఈపీఎఫ్ సభ్యులు తమకు అవసరమైన పరికరాలను కొనేందుకు పేరా 68N ప్రకారం, ఈపీఎఫ్ డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు.