Dubai Visa For Indians :దుబాయి ప్రభుత్వం ప్రత్యేకంగా భారతీయ టూరిస్టుల కోసం సరికొత్త వీసా విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దాని పేరే '5 Year Multi Entry Visa'. దీని సాయంతో కేవలం ఒక్కసారి వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే, గరిష్ఠంగా 5 ఏళ్ల వరకు మీకు నచ్చినన్ని సార్లు యూఏఈని సందర్శించవచ్చు. మరి ఈ స్పెషల్ వీసాకు దరఖాస్తు చేసుకునేందుకు కావాల్సిన ధ్రువపత్రాలు ఏంటి? దీనికి ఎవరు అర్హులు? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వీరు అర్హులు
- దుబాయి టూరిజం డిపార్ట్మెంట్ తీసుకువచ్చిన ఈ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ వీసాకు దరఖాస్తు చేసుకోవాలంటే కచ్చితంగా భారత పాస్‌పోర్ట్‌ను కలిగి ఉండాలి.
- వీసాకి దరఖాస్తు చేసిన తేదీ నుంచి పాస్‌పోర్ట్ వ్యాలిడిటీ కనీసం 6 నెలలకు పైగా ఉండాలి.
వీసా దరఖాస్తుకు కావాల్సిన డాక్యుమెంట్స్
- రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్
- యూఏఈలో చెల్లుబాటు అయ్యే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ.
- గత 6 నెలల కాలంలో 4వేల డాలర్లు లేదా దానికి సమానమైన కనీస బ్యాంక్ బ్యాలెన్స్‌ను కలిగి ఉండాలి. దీనిని స్టేట్మెంట్ రూపంలో సంబంధిత అధికారులకు అందించాలి.
- విమాన టిక్కెట్టు (దుబాయి నుంచి)
- దుబాయ్‌లో మీరు తీసుకునే వసతికి సంబంధించిన వివరాలను అధికారులకు చూపించాలి. అంటే మీరు ఉండబోయే హోటల్ లేదా ఇంటి చిరునామా వివరాలను సమర్పించాలి.
వీసా వివరాలు
- వ్యాలిడిటీ- 5 సంవత్సరాలు
- ఎంట్రీలు- మల్టిపుల్ ఎంట్రీలు
- స్టే వ్యవధి- ఒక్కసారి విజిట్ చేస్తే 90 రోజుల వరకు దుబాయిలో స్టే చేయవచ్చు. దీనిని మరో మూడు నెలలకు కూడా పొడిగించుకోవచ్చు. అంటే మొత్తంగా ఒక్క విజిట్‌కు వెళ్తే గరిష్ఠంగా 180 రోజుల వరకు దుబాయి లేదా యూఏఈలో ఉండవచ్చు.
- ప్రాసెసింగ్ సమయం- దరఖాస్తు చేసుకున్న 2 నుంచి 5 వర్కింగ్ డేస్‌లో మీ చేతికి వీసా వచ్చేస్తుంది.