Credit Card Rewards for Travel in Telugu : చాలా మందికి ప్రపంచాన్ని చుట్టిరావాలని ఉంటుంది. కానీ అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయితే, మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే పెద్ద పనేం కాదు. రివార్డ్ పాయింట్స్ ఉపయోగించి ఉచితంగా ప్రపంచ ప్రయాణం చేయవచ్చు. చాలా క్రెడిట్ కార్డులు 'రివార్డు పాయింట్లు', 'ఎయిర్ మైల్స్' ఆఫర్లు చేస్తాయి. వీటిని ఉపయోగించి ఉచితంగా విమానంలో ప్రయాణించడం, హోటల్స్ ఉండటం లాంటివి చేయవచ్చు. సరైన క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకోవడం, ఖర్చుల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించడం ద్వారా తగినన్ని రివార్డు పాయింట్లు పొందవచ్చు. అయితే ఈ పాయింట్లను పెంచుకోవడానికి క్రెడిట్ కార్డు వినియోగం, ప్రయాణాలను సరిగ్గా ప్లాన్ చేసుకోవడం ముఖ్యం. సరైన ప్రణాళిక ఉంటే ఉచితంగా ప్రయాణించవచ్చు.
ఎయిర్ మైల్స్ అనేవి ఒకరకమైన రివార్డు పాయింట్లు. ఇవి కొన్ని నిర్దిష్ట విమానయాన సంస్థ లేదా దాని అనుబంధ సంస్థల్లో టికెట్ల కొనుగోలు చేయడం ద్వారా పొందే పాయింట్లు. వీటిని ఫ్లైయర్ మైల్స్ అని కూడా పిలుస్తారు. ఈ పాయింట్లను ఉపయోగించి పలు రివార్డులు పొందడం సహా ఉచిత విమాన ప్రయాణం లేదా వాటిల్లో డిస్కౌంట్లు పొందవచ్చు. తరచూ ఫ్లైట్ జర్నీ చేసే వారు ప్రయాణ ఖర్చుల్ని తగ్గించుకోవడానికి ఎయిర్ మైల్స్ ఒక అద్భుత మార్గం. ఈ ఎయిర్ మైల్స్‌ని ఎలా పొందాలో తెలుసుకుందాం.
ప్రయాణించి రివార్డులు పొందడం
Fly and Earn :విమాన ప్రయాణాలు చేయటం ద్వారా ఈ ఎయిర్ మైల్స్ సంపాదించవచ్చు. వీటితో నిర్దిష్టమైన ఎయిర్‌లైన్స్ లైదా దాని అనుబంధ వాటితో ప్రయాణించవచ్చు. ఉదాహరణకు, విస్తారా టికెట్‌ను బుక్ చేసుకుంటే, వాటికి అయిన ఖర్చు ఆధారంగా 'క్లబ్ విస్తారా'కు సంబంధించిన పాయింట్స్ సంపాదించవచ్చు.
కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లు
Co Branded Credit Cards: కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లతో కూడా ఎయిర్ మైల్స్ పొందవచ్చు. వీటిని పలు విమానయాన సంస్థలతోపాటు బ్యాంకులు కూడా అందిస్తాయి. రోజువారీ ఖర్చుల ద్వారా ఈ ఎయిర్ మైల్స్ సంపాదించే అవకాశం ఉంది. ఉదాహరణకు, యాక్సిక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి విస్తార ఎయిర్‌లైన్స్ టికెట్‌ను కొనుగోలు చేస్తే, వాటి క్లబ్ పాయింట్లను పొందవచ్చు.