Commercial Lpg Cylinder Price Hiked :19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను శుక్రవారం రూ.25.50 మేర పెంచాయి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు. గృహ అవసరాలకు ఉపయోగించే వంటగ్యాస్ ధరను మాత్రం యథాతథంగా ఉంచాయి. ప్రస్తుతం 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.903గా ఉంది.
కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను హోటల్స్, రెస్టారెంట్లు లాంటి వాటిల్లో వాడతారు. తాజా తగ్గిన కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు శుక్రవారమే అమల్లోకి వచ్చాయి. తాజా పెంపుతో దిల్లీలో రిటైల్ 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,769.50 నుంచి రూ.25.50 పెరిగి రూ.1,795కు చేరింది. చెన్నైలో రూ.1,960.50, ముంబయిలో రూ.1,749, కోల్‌కతాలో రూ.1,911 అయ్యింది.
ప్రతినెలా ఒకటో తేదీన
ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)లు ప్రతి నెల 1వ తేదీన వంటగ్యాస్, ఏటీఎఫ్ ధరలను సవరిస్తూ ఉంటాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథం :
ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రికార్డు స్థాయిలో గత 21 నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలను యథాతథంగానే ఉంచుతున్నాయి. ప్రస్తుతం దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, లీటర్ డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
పెరిగిన విమాన ఇంధన ధరలు
విమాన ఇంధన (ATF) ధరలను సైతం ప్రభుత్వ రంగ ఇంధన రిటైల్ సంస్థలు శుక్రవారం పెంచాయి. దిల్లీ, కోల్‌కతాలో దేశీయ విమానయాన సంస్థలకు కిలోలీటర్ ఏటీఎఫ్ ధర రూ.1,01,397 నుంచి రూ.8,900 పెరిగి రూ.1,10,297కు చేరింది. ముంబయిలో రూ.98,806కు, చెన్నైలో రూ.1,05,399కు పెరిగింది. అంతర్జాతీయ సేవలు నిర్వహిస్తున్న దేశీయ విమాన సంస్థలకు ఈ ధరలను దిల్లీలో 921.4 డాలర్లు, కోల్‌కతాలో 959.49 డాలర్లు, ముంబయిలో 919.49 డాలర్లు, చెన్నైలో 916.49 డాలర్లుగా నిర్ణయించారు. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో 40 శాతం వాటా ఏటీఎఫ్‌దే కావడం గమనార్హం. అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా వీటి ధరల్లో మార్పులు చేస్తుంటారు.
పెరిగిన విండ్‌ఫాల్ పన్ను
దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై విండ్‌ఫాల్ పన్నును ప్రభుత్వం పెంచింది. టన్నుకు ప్రస్తుతం రూ.3,300 ఉండగా దాన్ని రూ.4,600 చేసింది. డీజిల్ ఎగుమతులపై పన్నును లీటరుకు రూ.1.5కు కుదించింది. ఏటీఎఫ్, పెట్రోలు ఎగుమతులపై ప్రస్తుతానికి ఎలాంటి పన్ను లేదు. కొత్త పన్ను రేట్లు మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రతి 15 రోజులకోసారి విండ్‌ఫాల్ పన్నులో ప్రభుత్వం మార్పులు చేస్తోంది.
పేటీఎం సంక్షోభం - PPBLతో ఒప్పందాలు రద్దు చేసుకున్న మాతృసంస్థ
బ్యాంక్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్- ఇకపై వారానికి 5 రోజులే పని!- శాలరీ హైక్!!