తెలంగాణ

telangana

ETV Bharat / business

పర్సనల్ లోన్ కావాలా? ముందుగా ఈ 5 ప్రశ్నలు వేసుకోండి! - credit score for personal loan

5 Questions Before Taking Loan : చాలా మంది తమ ఆర్థిక అవ‌స‌రాల‌ కోసం బ్యాంకు లోన్స్​ తీసుకుంటూ ఉంటారు. ఇది మంచిదే అయినా, రుణం తీర్చడంలోనే ఉంటుంది అస‌లైన క‌ష్టం. ఒక వేళ మీరు కూడా వ్య‌క్తిగ‌త లోన్ తీసుకోవాల‌ని అనుకుంటున్నారా? అయితే అంత‌కంటే ముందు మిమ్మ‌ల్ని మీరు ఈ 5 ప్ర‌శ్న‌లు వేసుకోండి.

personal loan tips
5 Questions Before taking Loan

By ETV Bharat Telugu Team

Published : Feb 13, 2024, 4:14 PM IST

5 Questions Before Taking Loan :చాలా మంది తమ ఆర్థిక అవ‌స‌రాల కోసం అప్పు చేయ‌డ‌మో, బ్యాంకు నుంచి రుణం తీసుకోవ‌డమో చేస్తుంటారు. ఒక వేళ మీరు కూడా ప‌ర్స‌న‌ల్ లోన్ తీసుకోవాలని అనుకుంటే, కచ్చితంగా కొన్ని అంశాల‌ను పరిగ‌ణ‌నలోకి తీసుకోవాలి. ఖర్చుల నిర్వహణ‌, ఇప్పటికే ఉన్న అప్పులు తీర్చ‌డం లాంటి అంశాలను చూసుకోవాలి. మ‌న‌కు తెలిసినవారే కాక, మార్కెట్​లో చాలా మంది రుణ‌దాత‌లు ఉంటారు. కానీ బ్యాంకులు లేదా ఆర్​బీఐ ఆమోదం పొందిన సంస్థ‌ల నుంచి రుణం తీసుకోవ‌డమే బెట‌ర్. అయితే, దీని కంటే ముందు మిమ్మ‌ల్ని మీరు కొన్ని ప్ర‌శ్న‌లు వేసుకోవాలి. అవేంటంటే?

1. ఎంత అమౌంట్ అవ‌స‌రం?
మొదటిగా మీ అవసరాలకు ఎంత డబ్బు అవసరం అవుతుంది? అనే ప్రశ్న వేసుకోవాలి. దీని వ‌ల్ల క‌చ్చిత‌మైన అంచ‌నాతో మీ ఆర్థిక అవ‌స‌రాల‌కు అనుగుణంగా రుణ మొత్తాన్ని తీసుకోవడానికి వీలవుతుంది. ఇది మీపై అదనపు రుణభారం పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే,

  • మీ ఆదాయం, నెలవారీ ఖర్చులను లెక్కించాలి.
  • అనవసరమైన ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
  • ఈఎంఐలు చెల్లించడానికి ఎంత డబ్బు అవసరం అవుతుందో చూసుకోవాలి.

2. బెట‌ర్ రీపేమెంట్ టైమ్?
లోన్​ తీసుకునేటప్పుడే సరైన రీపేమెంట్ కాలవ్యవధిని కూడా ఎంచుకోవాలి. తక్కువ కాలవ్యవధిని ఎంచుకుంటే, పెద్ద మొత్తంలో ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది. కానీ వడ్డీ భారం తగ్గుతుంది. దీర్ఘకాల వ్యవధిని ఎంచుకుంటే నెలవారీ ఈఎంఐ భారం తగ్గుతుంది. కానీ పెద్ద మొత్తంలో వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. స్థిరమైన ఆదాయం ఉన్నవాళ్లకు వాయిదాలు చెల్లించడం పెద్ద కష్టమేమీకాదు. ముందస్తుగా రుణం చెల్లించేవారికి కూడా పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ జాబ్​ గ్యారెంటీ లేనివారి విషయంలో రుణ వాయిదాలు చెల్లించడం కాస్త కష్టమైన వ్యవహారామే. కనుక లోన్ రీపేమెంట్​ కాల వ్యవధిని చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి.

3. క్రెడిట్ స్కోర్ సరిపోతుందా?
పర్సనల్ లోన్ తీసుకునే ముందు, మీ ప్రస్తుత క్రెడిట్ స్కోర్​ను ఒకసారి చెక్​ చేసుకోవాలి. క్రెడిట్ స్కోర్ బాగుంటేనే బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. పైగా తక్కువ వడ్డీకే లోన్ ఇస్తాయి. ఒక వేళ మీ క్రెడిట్ స్కోర్ బాగా తక్కువగా ఉంటే, లోన్ దొరకడం కష్టమవుతుంది. ఒక వేళ లోన్ దొరికినా, అధిక వడ్డీ రేట్లు, ఫీజులు చెల్లించాల్సి వస్తుంది.

4. రుణదాతల విషయంలో జాగ్రత్త!
సరైన రుణదాతను ఎంచుకోవ‌డం ముఖ్యం. నేడు అనేక బోగస్ రుణ సంస్థలు తెరమీదకు వచ్చాయి. ఇవి మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతూ, రుణగ్రహీతలను ఆర్థికంగా దోచుకుంటున్నాయి. మానసిక వేదనకు గురిచేస్తున్నాయి. అందువల్ల ఆర్​బీఐ అనుమతి పొందిన రుణ సంస్థల నుంచి, ప్రభుత్వ బ్యాంకుల నుంచి మాత్రమే రుణాలు తీసుకునే ప్రయత్నం చేయాలి. ఒక‌వేళ మీరు ఆన్​లైన్​లో లోన్ తీసుకోవాలని అనుకుంటే, సదరు సంస్థకు సంబంధించిన అన్ని నిబంధనలు, షరతులు, ఫీజులు గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ కంపెనీకి క‌స్ట‌మ‌ర్ కేర్ స‌పోర్ట్ ఉందో? లేదో? చూసుకోవాలి.

5. ముందస్తు చెల్లింపులు చేయవచ్చా?
లోన్​ తీసుకునే ముందు, రుణం ముందస్తు చెల్లింపు, దానికి సంబంధించిన ఇత‌ర ఫీజుల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. కొన్ని బ్యాంకులు లేదా సంస్థలు ముంద‌స్తు రుణ‌ చెల్లింపులపై రుసుములు వసూలు చేస్తుంటాయి. ఇలాంటివేవీ లేకుండా చేసుకోవాలి. ఒక వేళ ముందస్తు రుణ చెల్లింపు రుసుములు ఉన్నా, అవి వీలైనంత తక్కువగా ఉండేలా చూసుకోవాలి.

ఈ పోస్టాఫీస్ స్కీమ్​లో ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బులు డబుల్​!

పేటీఎం షేర్లు 9 శాతానికిపైగా పతనం- కంపెనీ గట్టెక్కేనా? యూజర్ల సంగతేంటి?

ABOUT THE AUTHOR

...view details