Wolf Attack In Uttar Pradesh : రెండు నెలల్లో ఎనిమిది మందిని చంపేసిన తోడేళ్ల మంద కోసం ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ వేట సాగిస్తోంది. రాత్రి వేళ్లలో గ్రామాల్లో ప్రజలపై దాడిచేసి చంపి తింటున్న తోడేళ్లను పట్టుకునేందుకు 'ఆపరేషన్ భేడియాను' నిర్వహిస్తోంది. ఆపరేషన్‌లో భాగంగా గురువారం మరో తోడేలును బంధించారు అధికారులు. ఇప్పటి వరకు నాలుగు తోడేళ్లను పటుకున్న అటవీశాఖ అధికారులు మిగిలిన వాటికోసం గాలిస్తోంది. తోడేళ్ల దాడిలో మృతి చెందినవారి కుటుంబాలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు.
బెహ్రయిచ్ జిల్లాలోని మెహ్సి తాలుకాలో రెండు నెలల్లో ఎనిమిది మందిని తోడేళ్ల మంద బలి తీసుకుంది. వారిలో ఏడుగురు చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు. మరో 30 మంది వరకూ తోడేళ్ల దాడిలో గాయపడ్డారు. ఎక్కువగా రాత్రి సమయాల్లోనే తోడేళ్లు దాడి చేస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. బహ్రాయిచ్ జిల్లాలో దాదాపు 30 గ్రామాల ప్రజలు తోడేళ్ల మంద నుంచి తమ పిల్లలను రక్షించుకునేందుకు కొన్ని వారాలుగా నిద్ర మానుకుని రాత్రివేళ బృందాలుగా కాపలా కాస్తున్నారు. మనుషులను తినడం అలవాటైన తోడేళ్ల నుంచి గ్రామస్థులను రక్షించేందుకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. తోడేళ్లను పట్టుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ కార్యక్రమానికి 'ఆపరేషన్ భేడియా' అని పేరు పెట్టింది.
16 బృందాలతో గాలింపు
తోడేళ్లను పట్టుకునేందుకు మొత్తం 16 బృందాలను మోహరించారు. 12 జిల్లా స్థాయి అధికారులు బహ్రాయిచ్‌లోనే బస చేసి ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నట్లు ప్రిన్సిపల్ చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ సంజయ్ శ్రీవాస్తవ చెప్పారు. అదనపు ప్రిన్సిపల్ చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ రేణు సింగ్ కూడా 'ఆపరేషన్ భేడియా'లో పాల్గొంటున్నారు. తోడేళ్లను పట్టుకునేందుకు వీలుగా మత్తు ఇంజెక్షన్లు ప్రయోగించేందుకు చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ నుంచి అనుమతి తీసుకున్నారు. అటవీశాఖ సిబ్బంది తోడేళ్ల మందను పట్టుకునేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. గ్రామాల్లో బోన్లు ఏర్పాటు చేశారు. రాత్రివేళ కూడా చూడగలిగే కెమెరాలతో కూడిన డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. డ్రోన్ల సాయంతో గుర్తించిన మూడు తోడేళ్లను ఇప్పటికే పట్టుకోగలిగారు. మొత్తం 12 తోడేళ్లు ఉన్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. గురువారం కులాయ్‌లా అనే గ్రామం వద్ద నాలుగో తోడేలును బోనులో బంధించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. కానీ, మొత్తం ఎన్ని ఉన్నాయో చెప్పలేమని అధికారులు ప్రకటించారు.
అవగాహన కార్యక్రమాలు
ఆపరేషన్ భేడియాను ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని అధికారులు తెలిపారు. తోడేళ్ల దాడుల్లో చనిపోయినవారి కుటుంబాలకు యూపీ సర్కార్ రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. గ్రామాల్లో తలుపులు లేని ఇళ్లకు బోన్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ మౌనికా రాణి తెలిపారు. అలాగే రాత్రి పహారాను మరింత ఉద్ధృతం చేశారు. తోడేళ్ల నుంచి పిల్లలను, పెద్దలను ఎలా కాపాడుకోవాలో గ్రామాల్లో ప్రజలకు ఆశా కార్యకర్తలతో అవగాహన కల్పిస్తున్నారు. పిల్లలు, పెద్దలు రాత్రివేళ బయట పడుకోవద్దని ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. తోడేళ్ల నుంచి గ్రామస్థులను కాపాడేందుకు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మహసి సురేశ్వర్ సింగ్ రైఫిల్‌తో తిరుగుతున్నారు. అన్ని తోడేళ్లను పట్టుకొనే వరకు ఈ ప్రాంతంలో ఉంటానని అన్నారు.