Wayanad Landslides Causes : అక్రమ కట్టడాలు, మైనింగ్‌వల్లే వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి ఘోర విపత్తు చోటుచేసుకుందని కేంద్ర పర్యావరణశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అభిప్రాయపడ్డారు. పశ్చిమ కనుమల్లో పర్యావరణ సున్నిత ప్రాంతాలను గుర్తించే ప్రక్రియపై రాష్ట్రాలతో చర్చిస్తున్నామని, త్వరలో తుది నిర్ణయానికి వస్తామని ఆయన తెలిపారు. పశ్చిమ కనుమల్లోని 56,800 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని పర్యావరణ సున్నిత జోన్‌గా ప్రకటించేందుకు 2014 నుంచి జులై 31 వరకూ ఆరు ముసాయిదా నోటిఫికేషన్లను జారీ చేశామని తెలిపారు. కానీ రాష్ట్రాల అభ్యంతరాలతో తుది నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పారు. దీనిపై చర్చలు జరుగుతున్నాయని, ఈ మధ్యలోనే కేరళలో అక్రమ నిర్మాణాలకు, మైనింగ్‌కు అనుమతులు ఇచ్చారని ఆరోపించారు. దీని వల్లనే వయనాడ్ ఘోరం చోటుచేసుకుందని వ్యాఖ్యానించారు.
హిమాలయాల మాదిరిగానే పశ్చిమ కనుమలు కూడా పెళుసుగా ఉండే ప్రాంతాలని భూపేంద్ర యాదవ్ తెలిపారు. ఈ ప్రాంతాల్లో విపత్తులను అడ్డుకునేందుకు గట్టి చర్యలు చేపట్టాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో కేరళ ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉందని స్పష్టం చేశారు.
ఒకే కుటుంబంలోని 11 మంది మృతి
- నౌఫాల్ అనే ఇంటి యజమాని 11 మంది కుటుంబ సభ్యులను వదిలి ఒమన్ వెళ్లారు. 3 నెలలు తిరక్కుండానే ఆ కుటుంబంలో పెను విషాదం చోటుచేసుకుంది. వయనాడ్ ప్రకృతి విపత్తు కారణంగా ఆయన కుటుంబంలోని 11 మంది కూడా మరణించారు. తన తల్లిదండ్రులు భార్య, పిల్లలు, సోదరుడు, మరదలు, వారి పిల్లలను ఆయన కోల్పోయారు.
- కేరళలో ప్రకృతి విలయంలో మృతిచెందినవారి సంఖ్య 222కు చేరుకుంది. 31 గుర్తు తెలియని మృతదేహాలకు సోమవారం అధికారులు సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు.