Wayanad Landslides Death Toll: కేరళ వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 174 మంది మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ ప్రమాదంలో గాయపడిన సుమారు 128 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి వీణాజార్జ్ తెలిపారు. ఇప్పటి వరకు 116 మంది మృతదేహాలకు శవ పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. మరోవైపు, వయనాడ్‌కు వెళ్తుండగా వీణా జార్జ్ వాహనం ప్రమాదానికి గురైంది. దీంతో ఆమె స్వల్పంగా గాయపడ్డారు. మంజేరి మెడికల్ కళాశాలలో చికిత్స పొందారు.
బుధవారం ఉదయం ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం 150 మంది ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. తాత్కాలిక వంతెనను కూడా నిర్మించారు. మరిన్ని బలగాలను రంగంలోకి దించనున్నట్లు సమాచారం. వయనాడ్లో మొత్తం 45 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. వాటిల్లో దాదాపు 3,069 మంది వరకు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే వరదలతో అతలాకుతలమవుతున్న కేరళకు భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. కొండచరియలు విరిగిపడిన ఘటనతో ఉక్కిరిబిక్కిరైన వయనాడ్‌కు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.
'ప్రజలంతా సహకరించాలి'
వయనాడ్ జిల్లాలో జరిగిన విధ్వంసం నుంచి కోలుకోవడానికి ప్రజలంతా సహకరించాలని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రజలకు పిలుపునిచ్చారు. మళ్లీ పునర్నిర్మించుకోవడానికి సాయమందించాలని కోరారు. 2018 వరదల సమయంలో ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని, అదే తరహా సాయం మళ్లీ కావాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు పంపించాలని సూచించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. వారి కోసం సమీపంలోని చర్చిలు, మదర్సాల్లో తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటు చేశామని వెల్లడించారు.