Virtual ATM Services :యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) రాకతో ఆన్లైన్ చెల్లింపులు గణనీయంగా పెరిగాయి. ఏవైనా కొనుగోలు చేసినప్పుడు వినియోగదారులు యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు. ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న స్మార్ట్‌ఫోన్ యూజర్లు సులువుగా ఈ లావాదేవీలు చేస్తున్నారు. ఫలితంగా డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులను తక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఎంత ఫోన్‌తో పేమెంట్స్ చేసినా, కొన్ని సమయాల్లో నగదు అవసరం అవుతుంది. దీంతో డెబిట్ కార్డుతో క్యాష్ విత్‌డ్రా చేస్తారు. అయితే కొన్నిసార్లు ఏటీఎంలలో నగదు దొరకకపోవచ్చు. అలాంటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి.
అయితే అలాంటి సమయాల్లో కూడా ఏటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డులు, యూపీఐ లేకుండా నగదు పొందే మార్గాలుంటే బాగుంటుంది కదా! అచ్చం అలాంటి సేవలే అందిస్తోంది 'పేమార్ట్' అనే ఫిన్‌టెక్ సంస్థ. చండీగఢ్ కేంద్రంగా పనిచేసే ఈ కంపెనీ కార్డులు, హార్డ్‌వేర్ మెషీన్లు లేకుండా వర్చువల్‌గా నగదు విత్‌డ్రా సేవలు అందిస్తోంది. ఏటీఎంకు వెళ్లే అవసరం లేకుండా కేవలం ఓటీపీతో నగదు విత్‌డ్రా చేసుకునేందుకు వీలు కల్పిస్తోంది.
వర్చువల్ ATM
తమ సేవలను పేమార్ట్ కంపెనీ వర్చువల్ ఏటీఎంగా అభివర్ణిస్తోంది. ఈ వర్చుల్ ఏటీఎం ద్వారా నగదు విత్‌డ్రా చేసుకోవాలంటే ఇంటర్నెట్ ఉన్న స్మార్ట్‌ఫోన్ సరిపోతుంది. మీరు కార్డ్‌లెస్ నగదు తీసుకోవాలంటే మొదటగా పేమార్ట్ బ్యాంకింగ్ యాప్‌ను మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి.
ఇలా నగదు విత్‌డ్రా చేసుకోవాలి
మొదటగా మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా బ్యాంకుకు విత్‌డ్రా రిక్వెస్ట్ చేయాలి. ఇది చేయాలంటే యూజర్ మొబైల్ నంబర్, బ్యాంక్ అకౌంట్‌తో రిజిస్టర్ అయి ఉండాలి. ఈ రిక్వెస్ట్‌కు సదరు వినియోగదారుడి బ్యాంక్, ఒక ఓటీపీ జనరేట్ చేస్తుంది. ఆ కోడ్‌ను మీ సమీపంలోని దుకాణాల్లో చూపిస్తే, వారు నగదు ఇస్తారు. ఈ సేవలు అందించే దుకాణాల లిస్ట్, లొకేషన్, ఫోన్‌నంబర్ తదితర వివరాలు పేమార్ట్ యాప్‌లో ఉంటాయి. మూరుమూల ప్రాంతాల్లో నివసించేవారు, అక్కడికి వెళ్లేవారికి ఈ సేవలు ఉపయోగపడతాయి.