Vande Bharat Train JK : జమ్ముకశ్మీర్‌లో ఉండే కఠిన శీతల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు తొలి ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. కాత్రాలోని మాతా వైష్ణోదేవి రైల్వేస్టేషన్ నుంచి శ్రీనగర్‌కు ప్రయాణికులను తీసుకుని తొలి ప్రయాణాన్ని సాగించింది. మార్గమధ్యంలో చీనాబ్ నది పై నిర్మించిన వంతెన ప్రధాన ఆర్చ్‌పై రైలు పరుగులు పెడుతున్న దృశ్యాలు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. రైలు ప్రయాణానికి సిద్ధపడిన సమయంలో భారత్ మాతాకు జై నినాదాలతో స్టేషన్ మార్మోగింది.
ఉష్ణ వ్యవస్థ ఏర్పాటు- నీరు, బయో టాయిలెట్లు గడ్డకట్టకుండా!
కాత్రాలో రైలును ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. కాత్రా నుంచి శ్రీనగర్‌కు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు సాగించనుంది. ఇప్పటికే నడుస్తున్న 36 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో పోలిస్తే వందే భారత్ రైలులో ఎన్నో అదనపు ఫీచర్లు ఉన్నాయి. సున్నా డిగ్రీల అతిశీతల వాతావరణం తట్టుకునేలా నీరు, బయో టాయిలెట్లు గడ్డకట్టకుండా ఉండేందుకు అధునాతన ఉష్ణ వ్యవస్థను ఇందులో ఏర్పాటు చేశారు.
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు (ETV Bharat) రైల్వే నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయడం సులభతరం
వాక్యూమ్ వ్యవస్థకు వేడి గాలిని సరఫరా చేసి అడ్వాన్స్‌డ్ ఎయిర్ బ్రేకింగ్ సిస్టమ్ దీని సొంతం. మంచు కురిసే సమయంలో లోకో పైలట్‌కు ముందు ఉన్న దృశ్యాన్ని స్పష్టంగా చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. దీని రాకతో కశ్మీర్ లోయలో రైల్వే అనుసంధానత మెరుగుపడి జమ్ముకశ్మీర్‌ను భారత రైల్వే నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయడం సులభతరం అయిందని అధికారులు తెలిపారు.
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు (ETV Bharat) దేశంలో తొలిసారిగా కేబుల్ స్టేయిడ్ రైలు వంతెన నిర్మాణం
జమ్ముకశ్మీర్‌లో చాలా లోయ ప్రాంతాలు ఉండడం వల్ల ఇంతకుముందు రైల్వే కనెక్టివిటీ అంతగా లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉధంపుర్- శ్రీనగర్- బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టును పూర్తి చేసింది. ఇందులో భాగంగా ఇంజినీరింగ్ అద్భుతమైన దేశంలో తొలిసారిగా కేబుల్ స్టేయిడ్ రైలు వంతెన- అంజి ఖాడ్‌ను నిర్మించారు. నదీ గర్భానికి 331 మీటర్ల ఎత్తులో ఇది ఉంది. ప్రపంచంలోనే అత్యంత అంటే రివర్‌బెడ్‌కు 359 మీటర్ల ఎత్తులో ఉన్న వంతెనను చీనాబ్ నదిపై నిర్మించారు. ఈ చీనాబ్ వంతెనపై తాజా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణించింది.