US Student Visa Process : గతేడాది రికార్డు స్థాయిలో విద్యార్థి వీసాలు జారీ చేయగా, ఈసారి కూడా అదేస్థాయిలో లేదా అంతకంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అమెరికా రాయబార కార్యాలయం అంచనా వేసింది. దేశవ్యాప్తంగా ఎనిమిదో విద్యార్థి వీసా వార్షికోత్సవాన్ని అమెరికా ఎంబసీ గురువారం నిర్వహించింది. దిల్లీ, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబయి కేంద్రాల్లో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు మొదలుపెట్టింది. దీంతో దేశ రాజధానిలోని యూఎస్ ఎంబసీ వెలుపల భారీ క్యూ కనిపించింది.
లక్షా 40వేల విద్యార్థి వీసాలు జారీ
అమెరికా వర్సిటీల్లో చేరికపై ఆసక్తి చూపిస్తున్న భారత విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. అందుకు తగినట్లుగానే అగ్రరాజ్యం కూడా వీసాల సంఖ్యను క్రమంగా పెంచుతోంది. గత ఏడాది రికార్డు స్థాయిలో లక్షా 40వేల విద్యార్థి వీసాలను జారీ చేసింది. మరే దేశానికి ఈ స్థాయిలో వీసాలు ఇవ్వలేదు. 2018, 2019, 2020ల్లో కలిపి ఇచ్చిన సంఖ్య కంటే 2023లోనే అధిక వీసాలు జారీ చేయడం గమనార్హం.
ఒక్కరోజే 4,000 మంది!
ఇదే విషయంపై భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయ తాత్కాలిక కాన్సులేట్ జనరల్ సయ్యద్ ముజ్‌తబా అంద్రాబీ మాట్లాడారు. 2023తో పోలిస్తే ఈ ఏడాది కూడా వీటి సంఖ్య అదే మాదిరిగా లేదా అంతకంటే ఎక్కువగా ఉండవచ్చన్నారు. వీటిపైనే ప్రధాన దృష్టి సారించామనని తెలిపారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న కాన్సులేట్ కార్యాలయాల్లో ముమ్మరంగా కృషి చేస్తున్నామని చెప్పారు. గురువారం ఒక్కరోజే 4,000 మంది విద్యార్థులను ఇంటర్వ్యూ చేశామని తెలిపారు.