తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వరుడి ఇంట్లో 'తిలక్' వేడుక- తిరిగివస్తుండగా ప్రమాదం- 'వధువు' కుటుంబంలో ఆరుగురు మృతి - up car accident today

UP Road Accident News Today : వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిందీ ఘటన.

UP Road Accident News Today
UP Road Accident News Today

By ETV Bharat Telugu Team

Published : Feb 5, 2024, 8:44 AM IST

Updated : Feb 5, 2024, 10:03 AM IST

UP Road Accident News Today :మరికొద్దిరోజుల్లో పెళ్లి భాజాలు మోగాల్సిన ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. వరుడి ఇంట్లో జరిగిన తిలక్ వేడుకకు వెళ్లిన వధువు కుటుంబసభ్యులు తమ తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురైన ప్రాణాలు కోల్పోయారు. అదుపు తప్పి కారు చెరువులోకి దూసుకెళ్లడం వల్ల ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఇద్దరు గాయపడ్డారు. ఉత్తర్​ప్రదేశ్​లోని కాన్పుర్ దెహాత్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

అసలేం జరిగిందంటే?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం- జిల్లాలోని డేరాపుర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని ముర్రా గ్రామానికి చెందిన పంకజ్ కుమార్తెకు ఇటీవలే వివాహం నిశ్చయమైంది. పెళ్లికి ముందు జరగాల్సిన క్రతువుల్లో భాగంగా ఆదివారం వరుడి ఇంట్లో తిలక్ వేడుక ఘనంగా జరిగింది. ఇటావాలో జరిగిన ఈ కార్యక్రమానికి పంకజ్ కుటుంబసభ్యులు కారులో వెళ్లి హాజరయ్యారు. ఎంతో ఆనందం గడిపిన వాళ్లు ఆదివారం రాత్రి తిరుగుపయనమయ్యారు.

రోడ్డు పక్కనే ఉన్న!
సోమవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో వధువు కుటుంబసభ్యులు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. సందల్​పుర్ రోడ్డు సమీపంలోని జగన్నాథ్​పుర్ గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులు, అధికారులకు సమాచారం అందించారు. ఒక్కసారిగా స్థానికులంతా ఘటనాస్థలిలో గుమిగూడారు.

ప్రమాదానికి గురైన కారు ఇదే

జేసీబీ సాయంతో కారు బయటకు
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. జేసీబీ సాయంతో కారును బయటకు తీశారు. కారులో ఎనిమిది మంది ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అందులో ఆరుగురు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. గాయపడిన ఇద్దరు చిన్నారులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదంలో గాయపడ్డ చిన్నారులు

అతివేగమే ప్రమాదానికి కారణం : పోలీసులు
ఆరుగురి మృతదేహాలను పోలీసులు శవపరీక్షల కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబసభ్యులకు మృతదేహాలను అందించనున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ఘటనా సమయంలో జోరుగా వర్షం కురుస్తున్నట్లు పోలీసులు చెప్పారు. అతి వేగం కారణంగానే కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

Last Updated : Feb 5, 2024, 10:03 AM IST

ABOUT THE AUTHOR

...view details