Jamili Election Bill In Lok Sabha :లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన జమిలి ఎన్నికల బిల్లు ఎట్టకేలకు పార్లమెంట్ ముందుకొచ్చింది. దీనికోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఎన్డీయే మిత్ర పక్షాలు ఈ బిల్లులకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. కానీ ఈ జమిలి బిల్లును కాంగ్రెస్ సహా విపక్షాలు అన్నీ తీవ్రంగా వ్యతిరేకించాయి. పూర్తి స్థాయి చర్చ జరిగేందుకు వీలుగా ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపనున్నారు.
ఓటింగ్
జమిలి బిల్లును లోక్‌సభ పరిగణనలోకి తీసుకోవడంపై విపక్ష సభ్యులు ఓటింగ్ కోరారు. ఇందుకు అంగీకరించిన స్పీకర్ హైబ్రిడ్ విధానంలో ఓటింగ్ నిర్వహించారు. 360 మంది ఎలక్ట్రానిక్ ఓటింగ్‌లో, మరికొందరు బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేశారు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో అనుకూలంగా 269 మంది, వ్యతిరేకంగా 198 మంది ఓటు వేశారు. దీనితో జమిలి ఎన్నికల బిల్లులు ప్రవేశపెట్టేందుకు లోక్‌సభ ఆమోదం లభించినట్లు అయ్యింది.
వ్యతిరేకించిన విపక్షాలు
ఓటింగ్‌కు ముందు జమిలి బిల్లుపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. "129వ రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకం. రాజ్యాంగ మౌలిక స్వరూపంపై దాడి చేస్తున్న ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నాం" అని కాంగ్రెస్ సభ్యుడు మనీశ్ తివారీ స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్‌కు విరుద్ధంగా బిల్లులను ప్రవేశపెట్టారని ఆయన మండిపడ్డారు.