These Tirupati Trains Diverted :తిరుమల తిరుపతిలో కొలువైన కలియుగ ప్రత్యక్షదైవం ఏడుకొండలవాడిని దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. సాధారణ సమయంలోనే తిరుమలలో(Tirumala) రద్దీ అధికంగా ఉంటుంది. ఇక సమ్మర్లో అంటారా.. పిల్లలకు వేసవి సెలవులు ఇవ్వడంతో శ్రీవారి దర్శనానికి వెళ్లే వారి సంఖ్య భారీగానే ఉంటుంది. ఈ క్రమంలో మీరూ సమ్మర్లో తిరుమలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారా? అది కూడా ట్రైన్లో వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీకో బిగ్ అలర్ట్.
దక్షిణ మధ్య రైల్వే.. సికింద్రాబాద్ డివిజన్లో ట్రాఫిక్ మెయింటనెన్స్ వర్క్స్ కారణంగా విజయవాడ డివిజన్ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా మరికొన్ని రైళ్లు దారి మళ్లిస్తున్నట్లు పేర్కొంది. అయితే, ఈ దారి మళ్లించిన రైళ్లలో తిరుపతి వెళ్లే ట్రైన్స్ కూడా ఉన్నాయి. ఇంతకీ, ఆ దారి మళ్లించిన రైళ్లు ఏంటి? అవి వెళ్లే కొత్త రూట్ ఏంటి? అదేవిధంగా ఏ ఏ రైళ్లను రద్దు చేశారు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆదిలాబాద్ - తిరుపతి(ట్రైన్ నంబర్ 17406), తిరుపతి - ఆదిలాబాద్(ట్రైన్ నెంబర్ 17405) మధ్య నడిచే రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇవి ప్రస్తుతం.. గూడూరు, విజయవాడ, కాజీపేట మీదుగా ప్రయాణిస్తుంటాయి. అయితే, తిరుపతి నుంచి ఆదిలాబాద్ వరకు అందుబాటులో ఉండే ట్రైన్(17405)ను ఏప్రిల్ 29, 2024 నుంచి మే 10 వ తేదీ వరకు, మే 16 నుంచి మే 22 వరకు దారి మళ్లిస్తున్నట్లు వెల్లడించింది సౌత్ సెంట్రల్ రైల్వే. అదేవిధంగా.. ఆదిలాబాద్ నుంచి తిరుపతి వరకు అందుబాటులో ఉండే ట్రైన్(17406)ను ఏప్రిల్ 28, 2024 నుంచి మే 9 వరకు, మే 15 నుంచి మే 21 వరకు రోజు ప్రయాణించే మార్గంలో కాకుండా కొత్త రూట్లో ప్రయాణించనుంది.