Tamil Nadu Hooch Tragedy : తమిళనాడు కళ్లకురిచ్చి కల్తీసారా ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 47మంది కన్నుమూశారు. ఆ సంఖ్య ఇంకాపెరిగే అవకాశముంది. ఆస్పత్రుల్లో 118 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 30మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్పారు. కల్తీసారా ప్రభావంతో కిడ్నీలు, ఇతర అవయవాలు విఫలం అవుతుండటం వల్ల నిపుణులైన వైద్యులను రంగంలోకి దింపారు. విళుపురం, సేలం తిరుచ్చి, తిరువణ్నామలై జిల్లాల్లోని వైద్య కళాశాలల వైద్యులను తరలించి చికిత్స అందిస్తున్నారు.
అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితులు
కళ్లకురిచ్చి ఘటనపై అన్నాడీఎంకే MLAలు నల్లదుస్తులు ధరించి అసెంబ్లీ ప్రాంగణంలో నిరనసలు చేపట్టారు. సభలోనూ గందరగోళం సృష్టించడం వల్ల ఎమ్మెల్యేలను శుక్రవారం అసెంబ్లీకి హాజరుకాకుండా బహిష్కరించారు స్పీకర్. అనంతరం నిరసన తెలుపుతున్న MLAలను పోలీసులు అక్కడి నుంచి తరలించడం వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి స్టాలిన్ విజ్ఞప్తితో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తిరిగి సభలోకి అనుమతించారు. ఈ దుర్ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ స్టాలిన్ CM పదవి నుంచి వైదొలగాలని అన్నాడీఎంకే డిమాండ్ చేసింది. జూన్ 24న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కే పళనిస్వామి ప్రకటించారు.