తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆరు నెలల తర్వాత స్టే ఉత్తర్వులు వాటంతటవే రద్దు కావు'- సివిల్​, క్రిమినల్​ కేసులపై సుప్రీం కీలక తీర్పు - supreme court judgement article 142

Supreme Court On Stay For 6 Months : సివిల్‌, క్రిమినల్‌ కేసుల్లో ట్రయల్‌ కోర్టులు, హైకోర్టులు జారీ చేసే స్టే ఉత్తర్వులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. క్రిమినల్​, సివిల్ కేసుల్లో ఇచ్చే ఉత్తర్వులు ఆరు నెలల తర్వాత వాటంతట అవే రద్దు కావని తీర్పును వెలువరించింది.

Supreme Court On Stay For 6 Months
Supreme Court On Stay For 6 Months

By ETV Bharat Telugu Team

Published : Mar 1, 2024, 10:17 AM IST

Supreme Court On Stay For 6 Months :సివిల్‌, క్రిమినల్‌ కేసుల్లో ట్రయల్‌ కోర్టులు, హైకోర్టులు జారీ చేసే స్టే ఉత్తర్వులు ఆరు నెలల తర్వాత వాటంతట అవే రద్దు కావని గురువారం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. ఈ అంశంపై గతంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. 2018లో ఆసియన్‌ రీసర్ఫేసింగ్‌ ఆఫ్‌ రోడ్‌ ఏజెన్సీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వర్సెస్‌ సీబీఐ కేసులో ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం, నిర్దిష్ట గడువు ప్రస్తావించకుండా ఉంటే ఆరు నెలల తర్వాత కోర్టులు జారీ చేసిన స్టే ఉత్తర్వులు వాటంతట అవే రద్దు అయిపోతాయని తీర్పును వెలువరించింది. తర్వాత ఈ తీర్పు సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసే స్టే ఉత్తర్వులకు వర్తించదని సుప్రీంకోర్టు వివరణ ఇచ్చింది.

2018 తీర్పుపై భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. ఇందులో జస్టిస్‌ ఎ.ఎస్‌.ఓకా, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌, జస్టిస్‌ మనోజ్‌ మిశ్ర ఉన్నారు. వాదోపవాదాలు విన్న ఈ ధర్మాసనం తన తీర్పును గతేడాది డిసెంబరు 13న రిజర్వులో ఉంచింది. గురువారం తీర్పును ప్రకటించింది. ఇందులో సీజేఐ, జస్టిస్‌ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్ర తరఫున జస్టిస్‌ ఎ.ఎస్‌.ఓకా ఒక తీర్పు, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌ మరో తీర్పు రాశారు. రెండు తీర్పులు దాదాపు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. 2018 తీర్పును వ్యతిరేకించాయి. రాజ్యాంగంలోని అధికరణ 142 కింద సర్వోన్నత న్యాయస్థానానికి ఉన్న అధికారాలపైనా ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అధికరణ పేరిట హైకోర్టు జారీ చేసే మధ్యంతర ఉత్తర్వులు ఆరు నెలలు మాత్రమే చెల్లుబాటు అవుతాయని సుప్రీంకోర్టు పేర్కొనడం సమంజసం కాదని స్పష్టం చేసింది. హైకోర్టులపై పరిమితులు విధించడం కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమని పేర్కొంది. కక్షిదారుల హక్కులకూ భంగకరమని తెలిపింది.

'రాజ్యాంగ కోర్టు(సుప్రీంకోర్టు, హైకోర్టులు)లు ఇతర కోర్టుల్లోని కేసుల పరిష్కారానికి కాలపరిమితి విధించకూడదు. అసాధారణమైన పరిస్థితుల్లో మాత్రమే అలాంటి ఆదేశాలు జారీ చేయాలి. కేసుల ప్రాధాన్యతను నిర్ణయించే అధికారం సంబంధిత కోర్టులకే విడిచిపెట్టాలి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఆ న్యాయస్థానాల న్యాయమూర్తులకే తెలుస్తుంది' అని ధర్మాసనం పేర్కొంది.

భార్య ఆత్మహత్య కేసు- 30ఏళ్లకు భర్తను నిర్దోషిగా ప్రకటించిన సుప్రీం

'పతంజలి మందులపై ఇక ప్రచారమొద్దు- మీ వల్ల దేశమంతా మోసపోయింది'

ABOUT THE AUTHOR

...view details