Supreme Court On Hemant Soren Arrest :మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ను అరెస్టు చేయడంపై తాము జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ విషయంపై ఝార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది.
కాగా, మనీలాండరింగ్ కేసులో హేమంత్‌ను విచారించిన ఈడీ జనవరి 31న అరెస్టు చేసింది. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తొలుత ఆయన ఝార్ఖండ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. గురువారం ఉదయం దానిపై ధర్మాసనం విచారించాల్సి ఉంది. ఆ సమయంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వి తదితరులు వ్యూహం మార్చారు. నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు.
హైకోర్టులో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి వారు తెలిపారు. కుట్రలో భాగంగానే ఈడీ తనను అరెస్టు చేసిందని సోరెన్ తన పిటిషన్లో ఆరోపించారు. రాజీనామా సమర్పణకు రాజ్‌భవన్‌కు వెళ్తే అక్కడే అరెస్టు చేయడం అన్యాయమని అన్నారు.
హేమంత్‌కు ఐదు రోజుల కస్టడీ
మరోవైపు, హేమంత్ సోరెన్‌ను 5 రోజుల రిమాండ్‌కు అప్పగిస్తూ రాంచీలోని PMLA కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గురువారం హేమంత్‌ను PMLA కోర్టు ఎదుట హాజరుపరచిన ఈడీ, ఆయనను 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరింది. 600 కోట్లకు సంబంధించిన భూకుంభకోణం కేసులో హేమంత్‌ను విచారించాలని వివరించింది. ఈ నేపథ్యంలో హేమంత్‌కు కోర్టు తొలుత ఒక రోజు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. తీర్పును రిజర్వులో ఉంచిన పీఎంఎల్‌ఏ కోర్టు, మరో 5 రోజులపాటు ఆయనను ఈడీ కస్టడీకి అప్పగిస్తున్నట్లు శుక్రవారం స్పష్టం చేసింది.
హేమంత్ రాజీనామా తర్వాత ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా జేఎంఎం సీనియర్ నేత చంపయీ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు మాజీ సీఎం హేమంత్ సోరెన్ ప్రారంభించిన సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తానని చంపయీ సోరెన్ తెలిపారు. రాంచీలోని రాజ్‌భవన్‌లో శుక్రవారం మధ్యాహ్నం జరిగిందీ కార్యక్రమం.