Sunitha Kejriwal Announcement :దిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించిన నిజానిజాలను తన భర్త అరవింద్ కేజ్రీవాల్ మార్చి 28న (గురువారం) కోర్టులోనే చెబుతారని ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. ఈ కేసుకు సంబంధించి వాస్తవాలన్నింటినీ ఆయన న్యాయమూర్తి ముందు బయటపెడతారని వెల్లడించారు. ఈ కుంభకోణం డబ్బులు ఎక్కడున్నాయనే వివరాలతోపాటు పూర్తి ఆధారాలు సమర్పిస్తారని చెప్పారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం ఆమె ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
దిల్లీ మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే ఆయన సతీమణి సునీత ఈ సంచలన ప్రకటన చేశారు. మంగళవారం సాయంత్రం సునీత అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారు.
'దిల్లీని నాశనం చేయాలని చూస్తున్నారు'
'నా భర్తను అరెస్టు చేసి ఈడీ కస్టడీలోకి తీసుకుంది. ఆయనకు ఆరోగ్యం సహకరించట్లేదు. షుగర్‌తో ఇబ్బందిపడుతున్నారు. కస్టడీలోనూ ఆయన ప్రజల గురించే ఆలోచిస్తున్నారు. అక్కడి నుంచే దిల్లీ ప్రజల బాగోగులు అడిగి తెలుకుంటున్నారు. దీన్ని కూడా మోదీ ప్రభుత్వం సమస్యగా మారుస్తోంది. ఆయనపై అక్రమ కేసులు పెడుతోంది. దిల్లీని నాశనం చేయాలని వారు కోరుకుంటున్నారు. ఈ వరుస పరిణామాలతో కేజ్రీవాల్ ఆందోళన చెందుతున్నారు' అని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ నిజమైన దేశభక్తుడని, ధైర్యం గల నేత అని తెలిపారు.
"మద్యం కేసుకు సంబంధించి ఈడీ అధికారులు ఇప్పటివరకు 250 సార్లకుపైగా సోదాలు జరిపారు. ఎందులోనూ వారికి ఏమీ దొరకలేదు. ఈ కేసుకు సంబంధించి మార్చి 28న కోర్టులో అన్ని నిజాలు బయటపెడతానని అరవింద్ కేజ్రీవాల్ నాతో చెప్పారు. లిక్కర్ స్కాం డబ్బు ఎక్కడుందో కూడా ఆయన న్యాయస్థానంలో చెబుతారు. అందుకు తగిన ఆధారాలు కూడా ఇస్తారు."
- సునీతా కేజ్రీవాల్, దిల్లీ సీఎం సతీమణి