Summer Special Curd Chutneys :సమ్మర్లో చాలా మంది వేపుళ్లు, మసాలా కూరల్ని తగ్గించి పెరుగును ఎక్కువగా తీసుకుంటుంటారు. అయితే.. పెరుగులో పోషక విలువలున్నా ఊరికే అవే తినాలంటే కొందరికి చిరాకు అనిపిస్తుంది. అలాంటి వారికోసం ఈ పెరుగు పచ్చళ్లు సూపర్ ఆప్షన్. వెరైటీగా ఉండడమే కాకుండా వేడి ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. మరి.. వాటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
మామిడికాయ పెరుగు పచ్చడి :
కావాల్సిన పదార్థాలు :
- పెరుగు - ఒకటిన్నర కప్పు
- పచ్చి మామిడికాయ - ఒకటి
- పచ్చిమిర్చి - కొన్ని
- చిన్న ఉల్లిపాయలు - 4(సన్నగా తరుక్కోవాలి)
- పసుపు - పావుచెంచా
- ఉప్పు - రుచికి సరిపడా
- ఆవాలు - పావుచెంచా
- మినపప్పు - చెంచా
- ఇంగువ - అరచెంచా
- కరివేపాకు - రెమ్మ
- ఎండుమిర్చి - 2
- నూనె - తగినంత
తయారీ విధానం :
- ముందుగా స్టౌపై ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. ఆపై అందులో ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి.
- ఆ తర్వాత దానిలో మినపప్పు, ఇంగువా, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లి, పచ్చిమిర్చి వేసి కాసేపు వేయించుకోవాలి.
- ఇప్పుడు మామిడి ముక్కలు, పసుపు వేసి ఆ మిశ్రమాన్ని మరో మూడు నిమిషాలు వేయించుకోవాలి.
- ఆపై దానికి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని మంట తగ్గించుకోవాలి.
- ఇప్పుడు చిలికిన పెరుగు, కొన్ని నీళ్లు యాడ్ చేసుకొని స్టౌ ఆఫ్ చేసుకోవాలి. చివరగా కొద్దిగా కొత్తిమీర కలుపుకోవాలి. అంతే.. నోరూరించే మామిడికాయ పెరుగు పచ్చడి రెడీ!
పెరుగు Vs మజ్జిగ - ఏది ఆరోగ్యానికి మంచిది?
సొరకాయ పెరుగు పచ్చడి :
కావాల్సిన పదార్థాలు :
- సొరకాయ ముక్కలు - కప్పు
- గిలకొట్టిన పెరుగు - రెండు కప్పులు
- ఉల్లిపాయ - ఒకటి
- పచ్చిమిర్చి - రెండు
- కరివేపాకు రెబ్బలు - రెండు
- ఎండుమిర్చి - రెండు
- ఉప్పు - తగినంత
- పసుపు - పావుచెంచా
- అల్లంపేస్ట్ - చెంచా
- జీలకర్ర - చెంచా
- నూనె - తగినంత
- ఆవాలు - చెంచా
- కొత్తిమీర - కొద్దిగా
తయారీ విధానం :
- సొరకాయ ముక్కల్ని కుక్కర్లో వేసి, ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు మరో పాత్రలో గిలకొట్టిన పెరుగును తీసుకోవాలి. అందులో తగినంత ఉప్పు, పసుపు, చల్లారిన సొరకాయ ముక్కలు, అల్లం పేస్ట్, కొత్తిమీర తరుగు వేసి మిక్స్ చేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి.
- ఆ తర్వాత స్టౌమీద కడాయి పెట్టి తగినంత నూనె వేసుకోవాలి. అది వేడెక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఆపై పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కాసేపు వేయించుకోవాలి.
- రెండు నిమిషాలయ్యాక స్టౌ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం కొద్దిగా చల్లారాక, అందులో మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న పెరుగు వేసి బాగా కలిపితే సరిపోతుంది.
- అంతే.. టేస్టీ సొరకాయ పెరుగు పచ్చడి రెడీ!
కీరాదోస పెరుగు పచ్చడి :
కావాల్సినవి : కీరదోస, ఉల్లిపాయ, పెరుగు, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం తరుగు, పుదీనా తరుగు, క్యారెట్ తరుగు, రుచికి సరిపడా ఉప్పు.
తయారీ విధానం :
- ముందుగా కీరదోస, ఉల్లిపాయ, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఆ తర్వాత ఒక పాత్రలో పెరుగును తీసుకొని గిల్లకొట్టుకోవాలి.
- ఆపై పెరుగులో సన్నగా తురుమి పెట్టుకున్న కీరదోస, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
- ఆ తర్వాత అల్లం, క్యారెట్, పుదీనా తరుగుతో పాటు రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.
- అదేవిధంగా జీలకర్ర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే.. కమ్మని కీరదోస పెరుగు పచ్చడి రెడీ!
చేప మాత్రమే కాదు.. ఇవి తిన్నాక కూడా పెరుగు అస్సలు తినొద్దు