తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహిళల సంక్షేమం కోసమే చట్టాలు- భర్తలను బెదిరించడానికి కాదు: సుప్రీంకోర్టు - SC ON MARRIAGE SYSTEM

కుటుంబానికి బలమైన పునాదిగా వివాహ వ్యవస్థను భావిస్తారన్న సర్వోన్నత న్యాయస్థానం- దంపతుల వివాహాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్య

SC On Marriage System
SC On Marriage System (ANI)

By ETV Bharat Telugu Team

Published : Dec 20, 2024, 6:50 AM IST

SC On Marriage System :వివాహ వ్యవస్థను హిందువులు పవిత్రమైనదిగా, కుటుంబానికి బలమైన పునాదిగా భావిస్తారని సుప్రీంకోర్టు పేర్కొంది. అది వ్యాపార సాధనం కాదని తెలిపింది. మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వాలు కఠినమైన చట్ట నిబంధనలను రూపొందించాయని వ్యాఖ్యానించింది. అంతే కానీ భర్తలను వేధించి, బెదిరించి, శిక్షించి, ఆస్తిని దండుకోవడానికి కాదని జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది.

ప్యాకేజీగా మార్చి కేసులు!
భార్యను క్రూరంగా హింసించారని, వేధింపులకు గురిచేశారని, అత్యాచారం చేశారనే ఆరోపణలన్నింటినీ ప్యాకేజీగా కూర్చి నేర శిక్షాస్మృతిలోని సెక్షన్ల ప్రకారం భర్త, అతడి కుటుంబ సభ్యులపై కేసులు పెడుతున్నారని ధర్మానం పేర్కొంది. తీవ్ర మనస్పర్థలతో విడివిడిగా నివసిస్తున్న దంపతుల వైవాహిక బంధాన్ని రద్దు చేస్తూ ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో భార్యకు శాశ్వత భరణం కింద రూ.12 కోట్లను నెలలోగా చెల్లించాలని భర్తను ఆదేశించింది. అతడిపై నమోదైన క్రిమినల్‌ కేసులను కొట్టివేసింది.

అత్యధికంగా ఆర్థికపరమైనవే!
భార్య తరఫున గట్టిగా బేరసారాలు చేసేందుకు భర్త, అతని కుటుంబ సభ్యులపై తీవ్రమైన నేరారోపణలు చేయటం కూడా పరిపాటిగా మారిందని ధర్మాసనం ఆక్షేపించింది. ఈ డిమాండ్లలో అత్యధికంగా ఆర్థికపరమైనవే ఉంటున్నాయని ధర్మాసనం తెలిపింది. గృహ హింస ఫిర్యాదులతో రంగంలోకి దిగే పోలీసులు కూడా భర్త తరఫు బంధువుల్లో వృద్ధులను, అనారోగ్యంతో ఉన్నవారిని కూడా అరెస్టు చేసి బెయిల్‌ రాకుండా చేస్తున్నారని, ఈ ఘటనలన్నీ గొలుసుకట్టు మాదిరిగా ఉంటాయని పేర్కొంది.

'ఆ కష్టాల్లో ఏమైనా భాగం పంచుకుంటుందా?'
తన భర్తకు రూ.5 వేల కోట్ల ఆస్తులున్నాయని, అతడి తొలి భార్యకు రూ.500 కోట్లను భరణంగా ఇచ్చారు కనుక తనకూ అదే స్థాయిలో చెల్లించాలన్న పిటిషనర్‌ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. కుటుంబ కోర్టు నిర్ణయించిన రూ.12 కోట్ల భరణాన్ని ఖరారు చేసింది. విడాకులు తీసుకున్న తర్వాత మాజీ భర్తకు వ్యాపారంలో నష్టాలు వచ్చి దివాలా తీస్తే మాజీ భార్య వచ్చి ఆ కష్టాల్లో ఏమైనా భాగం పంచుకుంటుందా? అని ధర్మాసనం ప్రశ్నించింది.

ABOUT THE AUTHOR

...view details