Strange Insects In Assam :అసోంలోని తేజ్పుర్లో వింత పురుగులు భాయాందోళనలకు గురిచేస్తున్నాయి. బామ్ పోర్బోటియా ప్రాంతంలో గత నాలుగైదు రోజులుగా ఇంటా, బయటా ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. దీంతో స్థానికులు తమ ఇళ్లను విడిచిపెట్ట వేరే చోటుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పురుగుల బారినుంచి ఎలా బయటపడాలో తెలియక స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
అయితే ఈ కీటకాలు ఇక్కడికి ఎలా వచ్చాయి అనే దానిపై స్పష్టత లేదు. స్థానికులు మాత్రం ఈ పురుగులు అకస్మాత్తుగా ఈ ప్రాంతంలో కనిపించాయని చెబుతున్నారు. ఇలాంటి వాటిని ఇంతకుముందు ఎన్నడూ ఇక్కడ చూడలేదని తెలిపారు. వెదురు పూతలోని పదార్థాన్ని తింటూ ఈ కీటకాలు పెరుగుతున్నాయని అన్నారు. బయట చెట్లపైనే కాకుండా అవి చుట్టూ ఉన్న ఇళ్లల్లోకి చేరుతున్నాయని చెప్పారు.
అయితే ఈ పురుగులు ఇళ్లలోకి చేరటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గృహాల్లో ఆహారపు ధాన్యాలు, దుస్తులు, బెడ్లపై ఈ పురుగులు చేరుతున్నాయని స్థానికులు తెలిపారు. అంతేకాకుండా పిల్లల చెవుల్లో దూరుతున్నాయని చెప్పారు. పురుగుల మందు కొట్టినా ఈ సమస్య తీరడం లేదని దీనికి తోడు రెట్టింపు సంఖ్యలో ఉద్భవిస్తున్నాయని వాపోయారు. దీని కారణంగా కొందరు స్థానికులు తమ ఇళ్లను వదిలి వేరే చోట తలదాచుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇంతటి బీభత్సం సృష్టిస్తున్న ఈ పురుగులు ఏమిటన్నది స్పష్టం కాలేదు. వీటిని ఇక్కడితో ఆపకపోతే ఇతర ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదం లేకపోలేదు.