అయితే ఈ ఘటనలో దాదాపు 116మంది మృతిచెందినట్లు అలీగఢ్ రేంజ్ ఐజీ శలాభ్ మథుర్ ధ్రువీకరించారు.
సత్సంగ్‌లో తొక్కిసలాట- 116మంది మృతి- యూపీలో ఘోర విషాదం - Stampede In Uttarpradesh
Published : Jul 2, 2024, 4:15 PM IST
|Updated : Jul 2, 2024, 5:46 PM IST
Stampede In Uttarpradesh : ఉత్తర్‌ప్రదేశ్‌లోని హత్రస్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ సత్సంగ్ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 116మంది మృతి చెందారు. అందులో మహిళలు, పిల్లులు కూడా ఉన్నారు. అనేక మంది గాయపడ్డారు. రతిభాన్పూర్‌లో ఏర్పాటు చేసిన ఓ శివారాధన కార్యక్రమంలో ఈ విషాదం జరిగింది.
LIVE FEED
ఈ ఘటనలో దాదాపు 87మంది మృతిచెందినట్లు ఆగ్రా ఏడీజీ డాక్టర్ అనుపమ్ కులశ్రేష్ఠ ధ్రువీకరించారు. అనేక మంది గాయపడ్డారని తెలిపారు.
హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 60కి చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదొక ప్రైవేటు కార్యక్రమం అని, దీని నిర్వహణకు ఎస్డీఎమ్ అనుమతి ఇచ్చారని సమాచారం. మరోవైపు, ఈ ఘటనపై స్పందించిన జిల్లా మేజిస్ట్రేట్ ఆశిష్ కుమార్, సత్సంగ్ అయిపోయిన తర్వాత, బయటకు వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. దీనిపై జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు, సహాయక చర్యలను సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా పరిశీలిస్తున్నారు. సహాయక చర్యలు వేగవంతం చేయడానికి ఇద్దరు మంత్రులు, చీఫ్ సెక్రటరీ, డీపీపీని ఘటనాస్థలికి పంపారు. వీరంతా ప్రత్యేక విమానంలో హత్రాస్‌కు చేరుకుంటున్నారు. అంతేకాకుండా ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని హోం శాఖ అదనపు కార్యదర్శి దీపక్ కుమార్‌ను సీఎం ఆదేశించారు.
సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి
హత్రాస్ జిల్లాలో జరిగిన ప్రమాదంపై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోలవాలని ఆకాంక్షించారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించాలని, ఘటనాస్థలిలో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని జిల్లా యంత్రంగాన్ని ఆదేశించారు. ఈ ఘటనకు కారణాలపై దర్యాప్తు చేయాలని ఆగ్రా ఏడీజీని యోగి ఆదేశించారు.
ఈ ఘటనపై స్పందించిన ఇటా వైద్యాధికారి ఉమేశ్ కుమార్ త్రిపాఠి, ఇప్పటివరకు పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి 27మృతదేహాలు వచ్చాయని, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించామని తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.