Shiv Ganga Express Accident Today : ఉత్తర్‌ప్రదేశ్ ఇటవా జిల్లాలో రెడ్ సిగ్నల్ పడినా, పట్టించుకోకుండా సుమారు కిలోమీటర్ ముందుకు వెళ్లింది శివగంగ ఎక్స్‌ప్రెస్. ఈ సమయంలో అదే లైన్లో మరో రైలు ఉంది. రెడ్ సిగ్నల్ పడినా రైలు రావడాన్ని గమనించిన అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో రైలులోని ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై వెంటనే దర్యాప్తునకు ఆదేశించినట్లు ఉత్తర మధ్య రైల్వే పీఆర్ఓ అమిత్ సింగ్ తెలిపారు. తప్పు చేసినట్లు తేలితే ఇద్దరు లోకోపైలట్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇదీ జరిగింది
దిల్లీ-హావ్‌డా రూట్లోని భర్థనా స్టేషన్‌కు ఐదు కిలోమీటర్ల ముందు 507 నంబర్ వద్ద రెడ్ సిగ్నల్ వేశారు అధికారులు. ఈ సమయంలో రైలు సుమారు 80కిలోమీటర్లు వేగంతో వస్తుంది. అయితే, ఈ రెడ్ సిగ్నల్‌ను పట్టించుకోని లోకోపైలట్లు సుమారు కిలోమీటర్ మేర ముందుకు పోనిచ్చారు. స్టేషన్లో హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఉండడాన్ని గమనించిన అధికారులు, వెంటనే శివగంగ ఎక్స్‌ప్రెస్‌కు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో పెను రైలు ప్రమాదం తప్పినట్లైంది. వెంటనే వైశాలి ఎక్స్‌ప్రెస్‌లో మరో ఇద్దరు లోకోపైలట్లను పంపించారు. దీంతో సుమారు 25 నిమిషాల అనంతరం రైలు బయలుదేరింది. ఇద్దరు లోకోపైలట్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరికి వైద్య పరీక్షలు సైతం చేశారు.