తెలంగాణ

telangana

ETV Bharat / bharat

150అడుగుల లోయలో పడ్డ యాత్రికుల బస్సు- 22మంది మృతి, 60మందికి గాయాలు - Road Accident Jammu - ROAD ACCIDENT JAMMU

Jammu Road Accident Today : జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 22 మందిని మృత్యువు కబళించింది. అక్నూర్‌లో సంభవించిన ఈ దుర్ఘటనలో 60 మంది గాయపడ్డారు. యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి 150 అడుగుల లోయలో పడిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.

Jammu Road Accident Today
Jammu Road Accident Today (ANI)

By ETV Bharat Telugu Team

Published : May 30, 2024, 5:58 PM IST

Updated : May 30, 2024, 8:04 PM IST

Jammu Road Accident Today :జమ్ముకశ్మీర్‌ అఖ్నూర్‌ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 22 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మంది గాయపడ్డారు. జమ్ము- పూంఛ్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడటం వల్ల ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. లోయలో పడి నుజ్జునుజ్జయిన బస్సు నుంచి పలువురి మృతదేహాలను వెలికితీశారు.

కురుక్షేత్ర నుంచి వస్తుండగా!
ప్రమాదంలోతీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 80 మందికి పైగా ప్రయాణికులున్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పారు. యాత్రికులతో నిండిన ఆ బస్సు హరియాణాలోని కురుక్షేత్ర నుంచి జమ్ముకశ్మీర్‌లోని శివఖోరీకి బయల్దేరినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గురైన ఆ బస్సు 150 అడుగుల లోయలో బోల్తా పడినట్లు వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం 12:35 గంటలకు ప్రమాదం జరిగినట్లు తెలిపారు.

ముర్ము, మోదీ విచారం!
అయితే బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఎక్స్ వేదికగా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. ప్రమాదంలో యాత్రికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు.

ఎల్​జీ దిగ్భ్రాంతి
జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జీ) మనోజ్ సిన్హా బస్సు ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తగినంత శక్తి ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు. రూ.50000 పరిహారం ప్రకటించారు. మరణించిన వారి కుటుంబసభ్యులకు రూ.5లక్షలు అందించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా సోషల్ మీడియాలో వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.

Last Updated : May 30, 2024, 8:04 PM IST

ABOUT THE AUTHOR

...view details