Jammu Kashmir Road Accident : జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో వాహనం అదుపు తప్పి లోయలో పడిపోవడం వల్ల ఐదుగురు చిన్నారులు సహా ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. కిష్త్వార్ నుంచి వస్తున్న వాహనం దక్షిణ కశ్మీర్‌లో కోకర్నాగ్ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. మృతుల్లో ఓ పోలీస్ కూడా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
ఘోర ప్రమాదంతో భీతావాహ వాతావరణం
జమ్ముకశ్మీర్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న కారు జుమాన్ ప్రావిన్స్‌లోని కిష్త్వార్ జిల్లా నుంచి బయలుదేరి కశ్మీర్ వస్తోంది. అనంతనాగ్ జిల్లాలోని కోకర్నాగ్ ప్రాంతంలోని దక్సమ్ వద్ద అతి వేగం కారణంగా కారు అదుపుతప్పింది. దీంతో కారు రోడ్డుపై నుంచి నేరుగా లోయలో బోల్తాపడింది. ఈ ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది ఘటనా స్థలంలోనే మరణించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం అక్కడ ఉన్న వారిని కలచివేసింది. ఎనిమిది మంది మృతదేహాలు ఘటనాస్థలిలో చెల్లాచెదురుగా పడిఉండడం వల్ల ఆ ప్రదేశమంతా భీతావాత వాతారణం నెలకొంది.
వాహనంలో చిక్కుకుపోయిన మృతదేహాలను వెలికితీసేందుకు చాలా సమయం పట్టింది. మృతుల కుటుంబసభ్యుల హాహాకారాలతో ఆ ప్రాంతమంతా విషణ్ణ వాతావారణం నెలకొంది. ఆరు నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న ఐదుగురు చిన్నారులు మృతుల్లో ఉండడం వల్ల విషాద ఛాయలు అలుముకున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించి మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. శవపరీక్ష తర్వాత మృతదేహాలను బంధువులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. అతి వేగం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధరించామని వెల్లడించారు. కేసు నమోదు చేశామని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
కశ్మీర్‌లోని దొడ జిల్లాలోనూ ఇలాంటి ప్రమాదమే జరిగింది. ఓ బస్ లోయలో పడిపోయిన ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోయింది. 9 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందాడు. జులై 21వ తేదీన రాజౌరీలో రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.