NCP leader Baba Siddique Passed Away :నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ పక్షం) సీనియర్ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. ముంబయిలోని బాంద్రాలో తన కుమారుడి కార్యాలయంలో ఉండగా, ముగ్గురు దుండగులు వచ్చి సిద్ధిఖీపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. వెంటనే అతనిని లీలావతి ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. దీనితో ఆదివారం ఉదయం ఆయన మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ కూపర్ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు సిద్ధిఖీపై కాల్పులకు పాల్పడ్డ వారిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు 5 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సిద్ధిఖీ కొన్ని నెలల కిందటే ఎన్సీపీలో చేరడం గమనార్హం.
రాష్ట్రంలో శాంతి, భద్రతలు క్షీణించాయి!
ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తీవ్రంగా ఖండించారు. లీలావతి ఆసుపత్రికి వెళ్లిన సీఎం ఏక్నాథ్ షిండే సిద్ధిఖీ కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులైనవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. మరోవైపు ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్యను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా ఖండించారు. ఈ దారుణానికి పాల్పినవారిని పట్టుకుని, కఠినంగా శిక్షించాలని కోరారు. మహారాష్ట్రలో శాంతిభద్రతలు క్షీణించాయని, ఈ ఘటనపై పారదర్శకంగా సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. శివసేన (యుబీటీ) నేతలు కూడా బాబా సిద్ధిక్ హత్యను ఖండించారు. మహారాష్ట్రలో శాంతి, భద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించారు.