Sanatana Dharma Row :డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు స్వల్ప ఊరట లభించింది. సనాతన ధర్మంపై వ్యాఖ్యల వివాదంలో ఆయనతో పాటు మరో ఇద్దరు నేతలు చట్టసభ సభ్యులుగా కొనసాగడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఉన్నత పదవుల్లో ఉన్నవారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది.
సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వారు అధికార పదవుల్లో కొనసాగడాన్ని సవాలు చేస్తూ రెండు హిందూ సంస్థలు, మరో వ్యక్తి పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లను మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనితా సుమంత్ కొట్టివేశారు. ప్రకటనలు చేసే ముందు చారిత్రక సంఘటనలను ధ్రువీకరించుకోవాలని సూచించారు. దీంతో మంత్రులు ఉదయనిధి స్టాలిన్, పీకే శేఖర్, ఎంపీ రాజాకు ఊరట లభించినట్లైంది.
స్టాలిన్‌పై సుప్రీం ఫైర్!
అయితే ఉదయనిధి స్టాలిన్‌పై ఇటీవల సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. "వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ, మత స్వేచ్ఛ కింద ఉన్న మీ హక్కులను దుర్వినియోగం చేశారు. ఇప్పుడు మీరే రక్షణ కోసం సుప్రీంకోర్టుకు వచ్చారు. మీరు చేసిన వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో తెలియదా? మీరేం సామాన్య పౌరుడు కాదు. ఓ మంత్రి పదవిలో ఉన్నారు" అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.