Sambhal Violence: ఉత్తర్‌ప్రదేశ్ సంభల్ జిల్లాలోని ఓ ప్రార్థనా మందిరం సమీపంలో చెలరేగిన హింసలో మృతుల సంఖ్య 4కు పెరిగింది. మొత్తం 30 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. తలకు గాయమైన ఒక కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉద్రిక్తతలు పెరుగుతాయన్న సమాచారంతో అప్రమత్తమైన ప్రభుత్వం సంభాల్‌లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. 12వ తరగతి వరకు పాఠశాలలను మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 30 వరకు అధికారుల ఆదేశాలు లేకుండా సంభాల్‌లోకి బయటి వ్యక్తులు, సామాజిక సంస్థ లేదా ప్రజా ప్రతినిధులు ప్రవేశించకుండా నిషేధించింది.
ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు మహిళలతో సహా 21 మందిని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హింసకు పాల్పడిన నిందితులపై కఠినమైన జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేయనున్నట్లు వెల్లడించారు. ఆ ప్రార్థనా మందిరం- మరో ప్రార్థనా మందిరాన్ని కూల్చి నిర్మించారన్న పిటిషన్ విచారణలో భాగంగా స్థానిక కోర్టు సర్వే చేయాలని ఆదేశించింది. సర్వే కోసం వెళ్లిన అధికారులపై వెయ్యిమందికి పైగా స్థానికులు రాళ్ల దాడి చేశారు. 10కి పైగా వాహనాలకు నిప్పు పెట్టారు. నిరసనకారులను టియర్‌గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించి పోలీసులు చెదరగొట్టారు. అనంతరం సర్వే నిర్వహించారు.