Sabarimala Pilgrims Insurance :కేరళలోని శబరిమల ఆలయాన్ని పర్యవేక్షించే ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు యాత్రికుల కోసం ఉచిత ప్రమాద బీమా పథకాన్ని తీసుకొచ్చింది. ఇటీవల జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో దురదృష్టవశాత్తు పలువురు అయ్యప్ప భక్తులు మరణించడం వల్ల ఆ నిర్ణయం తీసుకుంది. తద్వారా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందించనుంది.
మండల- మకరవిళక్కు సీజన్ మరికొద్ది రోజుల్లో ముగియనున్న వేళ ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు ఆ ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించింది. పథనంతిట్ట, కొల్లాం, అలప్పుజ, ఇడుక్కి జిల్లాల్లో ప్రమాదం జరిగితే ప్రాణాలు కోల్పోయిన యాత్రికుల కుటుంబసభ్యులకు రూ.5 లక్షల పరిహారం అందించనుంది. అందుకు గాను యాత్రికుల నుంచి ఎటువంటి రుసుము వసూలు చేయడం లేదు.
వర్చువల్ క్యూ పద్ధతి లేదా స్పాట్ బుకింగ్ ద్వారా బుక్ చేసుకున్న అందరి యాత్రికులకు ప్రమాద బీమా పథకం వర్తిస్తుంది. అందుకు గాను ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. అదనపు జిల్లాలకు కూడా బీమా పథక కవరేజీని విస్తరించే అంశంపై చర్చలు జరుపుతున్నట్లు దేవస్వం బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు.