Ramdev Baba Misleading Ads Case : పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ వ్యవస్థాపకుడు యోగా గురు బాబా రామ్‌దేవ్, కంపెనీ ఎండీ బాలకృష్ణపై సుప్రీం కోర్టు మండిపడింది. తప్పుదోవ పట్టించే మీడియా ప్రకటనలు ఇచ్చిందన్న కేసులో తమ ఆదేశాలను పాటించనందుకు తదుపరి చర్యలకు సిద్ధంగా ఉండాలని గట్టిగా హెచ్చరించింది. విచారణకు స్వయంగా రామ్‌దేవ్ బాబా, బాలకృష్ణ మంగళవారం సుప్రీం కోర్టు ముందు హాజరయ్యారు. వాదనల సందర్భంగా రామ్‌దేవ్ బాబా క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన న్యాయవాదులు కోర్టుకు తెలపారు. క్షమాపణలు చెప్పాలని, అయితే వాటిని అంగీకరించమని సుప్రీం స్పష్టం చేసింది.
మళ్లీ హాజరు కావాలి
ప్రకటనలకు సంబంధించి అన్ని హద్దులూ దాటారని సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేవలం సుప్రీం కోర్టు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న కోర్టులు జారీ చేసే ప్రతి ఉత్తర్వును గౌరవించాలి అని తెలిపింది. అలా చేయకపోతే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని సుప్రీం కోర్టు హెచ్చరిస్తుంది. కొవిడ్‌కు అల్లోపతిలో నివారణ లేదని పతంజలి చెప్పినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎలా కళ్లు మూసుకుందని ప్రశ్నించింది. ఈ కేసులో రామ్‌దేవ్, బాలకృష్ణ ఒక వారంలోగా మళ్లీ కొత్త అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఏప్రిల్ 10న మరోసారి న్యాయస్థానం ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని సూచించింది.