Wayanad Bypoll Priyanka Gandhi :తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగినకాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ ఘన విజయం సాధించారు. వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో తన ప్రత్యర్థులపై 4లక్షల 4 వేల 619 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎల్డీఎఫ్ అభ్యర్థి సత్యన్ రెండో స్థానంలో, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ మూడో స్థానంలో నిలిచారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానంలో తన సోదరుడు రాహుల్ గాంధీ రాజీనామా చేసిన వయనాడ్‌లో పోటీ చేశారు.
ప్రియాంక గాంధీ 1972 జనవరి 12న జన్మించారు. సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రియాంక గాంధీ 1997లో రాబర్ట్ వాద్రాను పెళ్లి చేసుకున్నారు. వాళ్లకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 2019 జనవరి 23న ప్రియాంక గాంధీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అప్పటి వరకు ఆమె పరోక్షంగా కుటుంబ సభ్యులకు ప్రచారం చేస్తూ వస్తున్నప్పటికీ, అధికారికంగా పార్టీ బాధ్యతలు చేపట్టడం అదే మొదటి సారి. తొలుత తూర్పు ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. ఆ తర్వాత ఉత్తర్ ప్రదేశ్‌కు పూర్తి ఇన్ఛార్జ్గా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో ఆమె విస్తృతంగా పర్యటించి, ప్రచారం చేసినా కాంగ్రెస్‌కు చెప్పుకోదగ్గ ఓట్లు రాలేదు. అయినప్పటికీ ధైర్యం కోల్పోకుండా నిరంతరం ఉత్తర్ప్రదేశ్లో ప్రజా సమస్యలపై ఆందోళనలు, ఉద్యమాలు చేస్తూ వచ్చారు.