President PM Modi Dussehra Celebrations : దేశవ్యాప్తంగా విజయ దశమిని పురస్కరించుకుని రావణ్ దహన్, రామ్‌లీలా నాటక ప్రదర్శనలు అంగరంగ వైభవంగా సాగాయి. తారాజువ్వల కాంతులు, బాణాసంచా చప్పుళ్ల మధ్య దసరా ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు.
దిల్లీలోని ఎర్రకోటలో దసరా వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ హాజరయ్యారు. రామ్‌లీలా నాటకాన్నీ చూసిన తర్వాత రాముడి పాత్రధారికి తిలక ధారణ చేశారు. అనంతరం రావణ, మేఘ్‌నాధ్, కుంభకర్ణుడి దహనం కోసం విల్లు ఎక్కుపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి ఉత్సవ నిర్వహణ కమిటీ త్రిశూలాన్ని, ప్రధానికి గదను బహూకరించింది. ఎర్రకోట ఆవరణలో నవ్ శ్రీ ధార్మిక్ లీలా కమిటీ నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు.
పట్నాలోని గాంధీ మైదాన్‌లో నిర్వహించిన దసరా ఉత్సవాల్లో బిహార్ సీఎం నీతీశ్ కుమార్, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి పాల్గొన్నారు. జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఎస్‌కే స్టేడియంలో రావణుడి భారీ నమూనాలను దగ్ధంచేశారు. ఆ కార్యక్రమానికి ఇటీవల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా హాజరయ్యారు. హిమాచల్ ప్రదేశ్‌లో దశ కంఠుని దహనాన్ని సీఎం సుక్వీందర్ తిలకించారు.
ఉత్తరాఖండ్, చంఢీగడ్‌లోనూ నిర్వహించిన రావణదహనాలు ఆకట్టుకున్నాయి.నవరాత్రులు పూజలందుకున్న దుర్గామాతలను గంగా ఒడిలో నిమజ్జనం చేస్తున్నారు. పశ్చిమ బంగాల్‌లో దుర్గా నిమజ్జనాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. సిలిగుడిలో మహిళలు సిందూర్ ఖేలాలో పెద్ద ఎత్తున పాల్గొని రంగులు పూసుకుని ఆడిపాడారు. ఉత్తరాఖండ్‌లోని దివ్యయోగ్ మందిరంలో యోగా గురు రామ్‌దేవ్ బాబా, పతంజలి ఆయుర్వేద ఎండీ ఆచార్య బాలకృష్ణ కన్యాపూజలను నిర్వహించారు.
తమిళనాడులో రావణుడికి పూజలు!
దేశవ్యాప్తంగా ఓ వైపు రావణ దహనాలను నిర్వహిస్తుండగా తమిళనాడు సహా మరికొన్ని చోట్ల రావణుడికి ప్రజలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మథురాలో సరస్వత్ బ్రాహ్మణ కమ్యూనిటీ సభ్యులు దశకంఠుడికి విగ్రహానికి పూజలు చేశారు. రావణుడిలో అపార భక్తితో పాటు ఎన్నో సుగుణాలు ఉన్నాయని వారు తెలిపారు.