Prajwal Revanna Suspend : అభ్యంతరకర వీడియోల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన్ ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణను జేడీఎస్ సస్పెండ్ చేసింది. మహిళలపై లైంగికదాడికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లు బయటకు రావటం వల్ల చర్యలు చేపట్టింది. అభ్యంతరకర వీడియోల వ్యవహారంపై చర్చించేందుకు మంగళవారం ఉదయం సమావేశమైన జేడీఎస్ కోర్ కమిటీ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నివేదిక వచ్చే వరకు ప్రజ్వల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకుంది.
'బీజేపీ, ప్రధాని మోదీకి ఎలాంటి సంబంధం లేదు'
ప్రజ్వల్ రేవణ్ణకు షోకాజు నోటీసు కూడా జారీ చేసినట్లు కోర్ కమిటీ భేటీ తర్వాత జేడీఎస్ అగ్రనేత, మాజీ సీఎం కుమారస్వామి తెలిపారు. సిట్ దర్యాప్తునకు పూర్తిగా సహకరించనున్నట్లు చెప్పారు. ఈ కేసుతో బీజేపీ, ప్రధాని మోదీకి, మాజీ ప్రధాని దేవెగౌడతోపాటు తనకు ఎలాంటి సంబంధం లేదని కుమారస్వామి తేల్చిచెప్పారు.
అంతకుముందు జేడీఎస్ కోర్ కమిటీ అధ్యక్షుడు జీటీ దేవెగౌడ మీడియాతో మాట్లాడారు. "ప్రజ్వల్ రేవణ్ణపై సిట్‌ను స్వాగతిస్తున్నాం. సిట్ విచారణ పూర్తయ్యే వరకు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మా పార్టీ జాతీయ అధ్యక్షుడికి సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకున్నాం" అని జీటీ దేవెగౌడ తెలిపారు. ఈ వీడియోలు బయటకు వచ్చిన వెంటనే కర్ణాటక ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించగా ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు పారిపోయారు. మరోవైపు ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించింది. మూడు రోజుల్లో పూర్తి నివేదిక సమర్పించాలని కర్ణాటక పోలీసులను ఆదేశించింది.