PM Modi Offer To Sharad Pawar Uddhav Thackeray : బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరాలని శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌లో చేరి నిర్వీర్యం అయ్యే బదులు అజిత్ పవార్, ఏక్నాథ్ శిందేతో కలవాలని హితవు పలికారు. జూన్ 4 తర్వాత చిన్న పార్టీలు మనుగడ కోసం కాంగ్రెస్‌లో విలీనమవుతాయని జోస్యం చెప్పారు. నకిలీ శివసేన, నకిలీ ఎన్సీపీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో విలీనం కావాలని భావిస్తున్నట్లు మోదీ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మహారాష్ట్రలో పర్యటించిన మోదీ నందర్భర్లో నిర్వహించిన బహిరంగ సభలో ఈ మేరకు ప్రసంగించారు.
"గత 40-50 ఏళ్లుగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న ఓ పెద్ద నాయకుడు, బారామతి లోక్‌సభ స్థానంలో పోలింగ్ తర్వాత ఏమవుతుందో అని ఆందోళన చెందుతున్నారు. జూన్ 4 తర్వాత చిన్న పార్టీలు మనుగడ కోసం కాంగ్రెస్‌లో విలీనమవుతాయి. అయితే కాంగ్రెస్‌లో విలీనం చేసి నిర్వీర్యం అయ్యే బదులు, అజిత్ పవార్, ఏక్నాథ్ శిందేతో కలవండి." అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అయితే రానున్న రెండేళ్లలో పలు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌తో మరింత సన్నిహితంగా మెలగుతాయని, లేదా తమ పార్టీకి మంచిదని భావిస్తే కాంగ్రెల్ విలీనం చేసే అవకాశం ఉందని శరద్ పవార్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రధాని మోదీ ఎన్సీపీ(శరద్ ), శివసేన(యూబీటీ)పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
నన్ను సజీవంగా పాతేస్తారట : మోదీ
హిందూ ధర్మాన్ని కాంగ్రెస్ అంతం చేయాలని అనుకుంటోందని ప్రధాని మోదీ ఆరోపించారు. రామ మందిరం, రామనవమి ఉత్సవాలు భారత్ ఆలోచనలకు విరుద్ధమని కాంగ్రెస్ రాజకుమారుడి(రాహుల్‌ను ఉద్దేశిస్తూ) గురువు అమెరికాకు చెప్పారని అన్నారు. 'మొఘల్ చక్రవర్తి ఔరంగాజేబులా, మహారాష్ట్రలో తనను కూడా సజీవంగా పాతిపెడతామని నకిలీ శివసేనకు చెందిన వారు(సంజర్ రౌత్‌ను ఉద్దేశిస్తూ) మాట్లాడుతున్నారు. వారి ఓటు బ్యాంకుకు నచ్చేలా నన్ను వారు దుర్భాషలాడారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం మన రాజ్యాంగ విలువలు, సూత్రాలకు విరుద్ధం. మోదీ బతికున్నంత కాలం దళితులు, ఆదివాసీలు, ఓబీసీల రిజర్వేషన్లు ముస్లింలకు మత ప్రాతిపదికన ఇవ్వడానికి నేను అనుమతించను.' అని ప్రధాని మోదీ అన్నారు.