PM Modi Assures Jammu and Kashmir Statehood :కొన్ని దశాబ్దాల తర్వాత జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదం, సరిహద్దుల్లో కాల్పుల భయం లేకుండా ఎన్నికలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జమ్ముకశ్మీర్ లో ఉగ్రదాడులు, రాళ్ల దాడుల భయం లేకుండా రాబోయే లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఉధంపుర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించారు.
జమ్ముకశ్మీర్ ప్రజల దీర్ఘకాల బాధలకు ముగింపు పలుకుతామన్న తమ హామీని నెరవేర్చామని తెలిపారు మోదీ. 'నేను గత ఐదు దశాబ్దాలుగా జమ్ముకశ్మీర్‌కు వస్తున్నాను. 1992లో లాల్ చౌక్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించేందుకు ఏక్తా యాత్ర చేపట్టాం. అప్పుడు మాకు ఘన స్వాగతం లభించింది. 2014లో వైష్ణో దేవి ఆలయంలో పూజలు చేసిన తర్వాత ఇదే వేదికపై నుంచి ఒక హామీ ఇచ్చా. తరతరాలుగా ఉగ్రవాదం వల్ల ఇబ్బందులు పడుతున్న జమ్ముకశ్మీర్ ప్రజలకు విముక్తి కల్పిస్తానని హామీ ఇచ్చాను. మీ ఆశీర్వాదంతో ఆ హామీని ప్రస్తుతం మోదీ నెరవేర్చారు. జమ్ముకశ్మీర్ లో ఎన్నికలు నిర్వహణకు ఉగ్రవాదం, వేర్పాటువాదం, రాళ్ల దాడులు, సీమాంతర ఉగ్రవాదం వంటి సమస్యలు ఇప్పుడు లేవు. వైష్ణో దేవి, అమర్‌నాథ్ తీర్థయాత్రల భద్రతకు సంబంధించిన ఆందోళన లేదు. ఆర్టికల్ 370ను పునురుద్ధరిస్తామని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయి. ఆ పనిని వారు చేయలేరు. దయచేసి నన్ను నమ్మండి. గత 60 ఏళ్లుగా జమ్ముకశ్మీర్ ఎదుర్కొన్న సమస్యల నుంచి విముక్తి పొందేలా చేస్తా.' అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికి కేంద్రం కట్టుబడి ఉందని, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రానున్న ఐదేళ్లలో జమ్ముకశ్మీర్ అభివృద్ధిలో కొత్త శిఖరాలకు తీసుకెళ్లానని హామీ ఇచ్చారు.
మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్
జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహిస్తామని ప్రధాని మోదీ మాట్లాడడంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. జమ్ముకశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆరోపించింది. జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని ప్రశ్మించింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎక్స్ లో కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించారు.