తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జవాన్ల వాహనం పేల్చేసిన మావోయిస్టులు- 9 మంది మృతి - NAXALITES BLOW UP ARMY VEHICLE

ఛత్తీస్​గఢ్​లో భద్రతా బలగాల వాహనం పేల్చివేసిన మావోయిస్టులు- 9 మంది మృతి

Naxalites Blow Up Security Personnel Vehicle
Naxalites Blow Up Security Personnel Vehicle (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 6, 2025, 3:13 PM IST

Updated : Jan 6, 2025, 6:09 PM IST

Naxalites Blow Up Security Personnel Vehicle :ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్‌ జిల్లాలో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు ఐఈడీ బాంబుతో పేల్చేశారు. ఈ ఘటనలో 8 మంది డిస్ట్రిక్ట్​ రిజర్వ్​ గార్డ్​-డీఆర్​జీ సిబ్బందితోపాటు ఓ డ్రైవర్​ మృతి చెందినట్లు బస్తర్​ రేంజ్​ ఐజీ సుందర్​రాజ్ తెలిపారు. మరో ఆరుగురికి గాయాలైనట్లు తెలుస్తోంది. దాడి జరిగిన సమయంలో వాహనంలో 15 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు సమాచారం.

దాడికి గురైన బస్సులోని సిబ్బంది దంతెవాడ, నారాయణ్​పుర్​, బీజాపుర్​లో యాంటీ నక్సలైట్ అపరేషన్ పూర్తి చేసుకుని బేస్​ క్యాంప్​నకు తిరుగుప్రయాణమయ్యారు. భద్రతా బలగాల కాన్వాయ్​ బీజాపుర్​లోని కుట్​రూ హరదారిపై వెళుతున్న క్రమంలో అంబేలీ గ్రామం వద్ద మావోయిస్టులు ఐఈడీ పేల్చేశారు. భారీ పేలుడు ధాటికి కాన్వాయ్​లోని ఓ వాహనం చెల్లాచెదురుగా పడిపోయింది. దీంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. పేలుడు జరిగిన ప్రాంతంలో పెద్ద గుంత ఏర్పడింది.

పేలుడు ప్రాంతంలో ఏర్పడిన భారీ గుంత (ETV Bharat)

దీనిపై సమాచారం అందుకున్న వెంటనే సహాయక చర్యల కోసం ఘటనాస్థలికి రీఇన్​ఫోర్స్​మెంట్​ టీమ్స్​ను పంపించినట్లు ఐజీ సుందర్​రాజ్ తెలిపారు. ఇదిలా ఉండగా, గత రెండేళ్లలో భద్రతా సిబ్బందిపై నక్సలైట్లు జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని ఓ అధికారి వెల్లడించారు.

పేలుడు ధాటికి చెట్టుపైకి ఎగిరిపోయిన వాహనంలోని ఓ భాగం (ETV Bharat)

'జవాన్ల బలిదానం వృథా కాదు'
మావోయిస్టుల చేసిన ఈ దాడిపై ఛత్తీస్​గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్​ సాయ్ స్పందించారు. "బీజాపుర్​లో నక్సలైట్లు జరిపిన దాడిలో 8 మంది జవాన్లు వీరమరణ పొందారనే వార్త చాలా బాధాకరం. అమరుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అమరులైన జవాన్ల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. బస్తర్​లో జరుగుతున్న నక్సల్స్​ నిర్మూలన చర్యలపై నక్సలైట్లు విసుగు చెందుతున్నారు. అందుకే ఈ పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారు. జవాన్ల బలిదానం వృథా కాదు, నక్సలిజాన్ని అంతం చేసేందుకు మా పోరాటం బలంగా కొనసాగుతుంది" అని ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ ఎక్స్​లో పోస్ట్ చేశారు.

'నక్సలిజం అంతం తథ్యం'
నక్సలైట్ల దాడిలో జవాన్లు మరణించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. "మన జవాన్ల త్యాగాలను వృథా కానివ్వం. 2026 మార్చి నాటికి భారత్​లో నక్సలిజం లేకుండా చేస్తాం" అని స్పష్టం చేశారు.

పేలుడు ధాటికి వంగిపోయిన వాహనం స్టీరింగ్ (ETV Bharat)

ఎన్​కౌంటర్​కు ప్రతీకారం?
శనివారం అర్థరాత్రి ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా ఓ డీఆర్​జీ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే గత రెండు రోజులుగా భద్రతా దళాలు మావోయిస్టుల కోసం గాలిస్తున్నాయి. ఈ క్రమంలోనే మావోయిస్టులు జవాన్ల కాన్వాయ్​పై దాడి చేశారు.

2023 ఏప్రిల్​ 26న దంతెవాడ జిల్లాలో భద్రతా సిబ్బందిని తీసుకువెళుతున్న కాన్వాయ్​పై నక్సలైట్లు ఇలాగే దాడి చేశారు. ఆ ఘటనలో 10మంది పోలీసులు సిబ్బంది సహా ఓ డ్రైవర్ మృతిచెందాడు.

Last Updated : Jan 6, 2025, 6:09 PM IST

ABOUT THE AUTHOR

...view details