Modi Nomination :భారత ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో పలువురు ఎన్డీఏ నేతలు పాల్గొన్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తదితరులు మోదీ వెంట రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చారు.
నామినేషన్ పత్రాలు దాఖలకు ముందు ప్రధాని మోదీ వారణాసిలోని గంగా నది ఒడ్డున ఉన్న దశాశ్వమేఘ ఘాట్‌లో పూజలు చేశారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య గంగమ్మ తల్లికి హారతి ఇచ్చారు. అనంతరం పర్యాటక బోటులో గంగానదీ విహారం చేశారు. కాలభైరవ ఆలయంలో పూజలు చేశారు.
హ్యాట్రిక్ విజయం కోసం!
సోమవారం సాయంత్రం యోగితో కలిసి మోదీ ఆరు కిలోమీటర్ల మేర భారీ రోడ్‌షో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ రోడ్‌షో వీడియో క్లిప్‌లను కూడా ఎక్స్‌లో పోస్ట్ చేశారు ప్రధాని. 'రోడ్ షోలో కాశీ కుటుంబ సభ్యులు(ప్రజలు) నాపై చూపించిన ప్రేమ, ఆశీర్వాదాలు ఎప్పటికీ మర్చిపోలేను' అని తెలిపారు.
సోమవారం కాశీ విశ్వనాథుడి ఆలయంలో మోదీ పూజలు చేశారు. రాత్రికి అక్కడే బస చేశారు. మోదీ నామినేషన్ ఏర్పాట్లను హోంశాఖ మంత్రి అమిత్‌షా, సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యవేక్షించారు. ఆ పార్టీ సీనియర్ నేత సునీల్ బన్సల్ చాలా రోజుల నుంచి వారణాసిలో ఉండి పనులను చక్కబెట్టారు. ఏడో విడతలో జూన్ ఒకటిన ఈ స్థానానికి పోలింగ్ జరగనుండగా, నామినేషన్ దాఖలు చేయడానికి గడువు నేటితో ముగియనుంది.
విజయం గ్యారెంటీ!
నామినేషన్ దాఖలకు ముందు ప్రధాని మోదీ ఓ జాతీయ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరుసగా మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే నెలలో(జూన్) జరగనున్న జీ-7 సదస్సులో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పాల్గొంటానని చెప్పారు. కాగా, జీ-7 శిఖరాగ్ర సమావేశం జూన్ 13-15 వరకు ఇటలీలోని పుగ్లియా నగరంలో జరగనుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రధాని మోదీకి ఈ సమావేశానికి రావాలని ఆహ్వానం అందింది.
మోదీకి పోటీగా
ఇక్కడ ప్రధానిపై కాంగ్రెస్ నుంచి యూపీ రాష్ట్ర పార్టీ శాఖ అధ్యక్షుడు అజయ్‌రాయ్ నిలబడిన సంగతి తెలిసిందే. మోదీపై ఈయన పోటీ చేయడం ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం. 2014లో ప్రధాని తొలిసారి ఇక్కడ పోటీ చేయగా, 56శాతం ఓట్లతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అజయ్ రాయ్‌కి కేవలం 75వేల ఓట్లు దక్కాయి. ఆమ్ ఆద్మీ తరఫున అరవింద్ కేజ్రీవాల్ రెండో స్థానంలో నిలిచారు. ఇక 2019 ఎన్నికల్లో ప్రధానికి 63 శాతం ఓట్లు రాగా అజయ్‌రాయ్‌కి 14శాతం ఓట్లు దక్కాయి. ఈసారి కూడా వారణాసి నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ శ్రేణులు ప్రధాని మోదీ తరపున ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం ప్రధాని మోదీపై బలమైన అభ్యర్థి అయిన అజయ్ రాయ్‌ను పోటీగా నిలిపింది. ఎలాగైనా వారణాసిలో సత్తా చాటాలని హస్తం పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
'మరణించిన అమ్మాయికి తగిన వరుడు కావాలి- ఆసక్తి ఉన్న వాళ్లు సంప్రదించండి!' - Marriage Of Ghosts
ఇరాన్‌తో 'చాబహార్' డీల్- అదే జరుగుతుంది అంటూ భారత్‌కు అమెరికా వార్నింగ్! - US Warns India