Modi Most Popular Leader : ప్రజాదరణలో ప్రపంచ దేశాల నేతలందరిలోనూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విభిన్నమైన వ్యక్తని అంతర్జాతీయ పత్రిక 'ఎకనామిస్ట్' అభిప్రాయపడింది. సాధారణంగా సామాన్య జనబాహుళ్యంలో అత్యంత ప్రజాదరణ ఉన్న ఏ నేతకైనా ఆ దేశంలోని విద్యా, సంపద పరంగా ఉన్నత స్థాయిలో ఉండే వర్గాల్లో సాకుకూలత ఉండదు. కానీ, మోదీకి మాత్రం అటువంటి వారిలోనూ బహుళ ప్రజామోదం లభిస్తోందని పేర్కొంది. 'వై ఇండియాస్ ఎలైట్స్ బ్యాక్ మోదీ' అనే పేరుతో ఎకనామిస్ట్ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది.
హుందాతనంతో కూడిన రాజకీయాలు (క్లాస్ పొలిటిక్స్), ఆర్థికం (ఎకనామిక్స్), ఉన్నత వర్గాల మెప్పు పొందడం (ఎలైట్ అడ్మిరేషన్) వంటి 3 అంశాలు మోదీకి ఈ వర్గాల్లో ఆదరణ కలిగి ఉండటానికి సహకరిస్తున్నాయని పేర్కొంది. ఒక రకంగా దీనిని మోదీ విభిన్న శైలిగా పిలవొచ్చని, డొనాల్డ్ ట్రంప్‌లాంటి నేతల గాటన కట్టినా మూడోసారి విజయం సాధిస్తారని భావిస్తున్న మోదీ అసాధారణ బలవంతుడు అని పత్రిక తెలిపింది. ప్రపంచంలోని చాలా దేశాల్లో ప్రజాదరణ కలిగిన (మాస్ అప్పీల్) ఇలాంటి నేతలను ఉన్నతస్థాయి వర్గం వ్యతిరేకిస్తుంటుంది. అమెరికాలో ట్రంప్‌నకు, బ్రిటన్‌లో బ్రెగ్జిట్ సమయంలో అక్కడి నేతలకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. కానీ భారత్‌లో ఆ పరిస్థితి లేదు అని ఎకనామిస్ట్ పత్రిక అభిప్రాయపడింది.
అన్ని వర్గాల్లోనూ సానుకూలత
అమెరికాలో యూనివర్సిటీ విద్య పూర్తి చేసుకున్న వారిలో 26శాతం మందే ట్రంప్‌నకు మద్దతు పలుకుతున్నారని గ్యాలప్ సర్వేలో వెల్లడైంది. అదే సామాన్య జనంలో ఆయనకు 50శాతం మద్దతు లభించింది. కానీ మోదీకి అన్ని వర్గాల్లోనూ ఒకే స్థాయిలో ఆదరణ ఉంది. 2017లో ప్రాథమిక పాఠశాల దాటని వారిలో 66 శాతం మంది మద్దతు మోదీకి లభించిందని పత్రికలో తెలిపింది. అదే సమయంలో ఎంతో కొంత ఉన్నత విద్యను అభ్యసించిన వారిలో 80శాతం మంది మద్దతు ఆయనకు లభించిందని పేర్కొంది. '2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్‌నీతి జరిపిన సర్వేలో డిగ్రీ చదివిన వారిలో 42 శాతం మంది మోదీకి మద్దతుగా నిలిచారు. అదే ప్రాథమిక స్థాయి విద్యను అభ్యసించిన వారిలో 35శాతం మంది మద్దతు ఉంది. ఉన్నత స్థాయి వర్గాల మద్దతు పొందే క్రమంలో మోదీ సామాన్యుల మద్దతును కోల్పోలేదు' అని ఎకనామిస్ట్ వివరించింది.