Man Drowned In River Karnataka : నదిలో కొట్టుకుపోతున్న ఇద్దరినీ కాపాడారో వ్యక్తి. కానీ ఆయన మాత్రం ఒడ్డుకు చేరలేక తిరిగి అదే నీటిలో మునిగి మరణించారు. ఈ ఘటన కర్ణాటకలోని బెళగావిలోని మలప్రభ నదిలో జరిగింది.
రామదుర్గ తాలూకా అవరాది గ్రామానికి చెందిన శ్రీశైల(47) ఆదివారం పెళ్లికి ముందు రోజు జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. భోజనం చేస్తుండగా మలప్రభ నదిలో ఇద్దరు వ్యక్తులు గల్లంతైనట్లు ఆయనకు తెలిసింది. దీంతో శ్రీశైల భోజనాన్ని మధ్యలోనే వదిలేసి నది వద్దకు వెళ్లారు.
నదిలోకి దూకి నీటిలో మునిగిపోతున్న ఇద్దరినీ రక్షించారు శ్రీశైల. కానీ ఆయన మాత్రం ఒడ్డుకు రాలేకోపోయారు. అదే నీటిలో మునిగి మృతి చెందారు. అయితే శ్రీశైల వ్యవసాయం చేసుకుంటూ తన తల్లితో కలిసి జీవిస్తున్నాడు. ఈ విషయంపై శ్రీశైల సోదరుడు నాగరాజు మాట్లాడాడు. 'ఆదివారం నదిలో ఈతకు వెళ్లిన ఓ బాలుడు నీటిలో మునిగిపోతున్నాడు. అతడిని రక్షించేందుకు వెళ్లిన యువకుడు కూడా నీటిలో మునిగిపోతున్నాడు. వారిద్దరినీ మా అన్న ఒడ్డుకు చేర్చారు. శ్రీశైల మాత్రమే తిరిగి రాలేదు. నదిలో ఎవరో మునిగిపోతున్నారని తెలియగానే సాయం చేసేందుకు పరుగులు వెంటనే తీశారు. గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా ముందుకొచ్చి సేవ చేసేవారు' అని నాగరాజు తెలిపారు.