Maha Kumbh Mela 2025 : ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా కోసం గొప్పగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే దేశం నలుమూలల నుంచి అనేక మంది సాధువులు, అఘోరాలు మహా కుంభమేళా కోసం ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. వీరిలో 32 ఏళ్లుగా స్నానం చేయని చోటూ బాబా, తలపై బార్లీ పండిస్తున్న ధన్వాలే బాబా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. వారి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం రండి.
తలపై బార్లీ పండిస్తున్న ధన్వాలే బాబా
ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళా జరుగుతున్న ప్రదేశంలో ధాన్‌వాలే బాబా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆయన తన తలపై బార్లీని పండిస్తున్నారు. ఇతర బాబాల్లా గుర్తింపు కోసం లేదా డబ్బు కోసం ఆ పని చేయడం లేదు. దాని వెనక ఓ సదుద్దేశం ఉంది. అది ఏమిటంటే, ధన్వాలే బాబా అసలు పేరు అమర్ జీత్. సాధువుగా మారిన ఆయన గత ఐదేళ్లుగా తన తలపై బార్లీ సాగుచేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రసాయనాలతో పండించిన ఆహార పదార్థాల వల్ల మనుషులు అనారోగ్యం పాలవుతున్నారని, అందుకే సహజంగా పండించిన పంటలను ఆహారంగా తీసుకోవడంపై అవగాహన కల్పించేందుకే తాను ఇలా చేస్తున్నానని అమర్‌జీత్ చెబుతున్నారు.
"ఇది 22 రోజుల మొలక. మన ప్రపంచం పచ్చగా ఉండాలని, మన త్రివర్ణ పతాకం కీర్తి మరింత శిఖరాలకు చేరాలని ఆకాంక్షిస్తూ నేను ఈ విధంగా చేస్తున్నాను. ఆ విధంగా నేను దేశ సేవ చేస్తున్నాను. పచ్చదనం కోసం, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి ఆవు పేడ, ఆకుల కంపోస్ట్ వంటి సహజ ఎరువులను ఉపయోగించడంపై అవగాహన కోసం ఇలా చేస్తున్నా. రోజు తలపై నీరు పోస్తా. ఇది రక్తం, చెమట, నీటితో తయారైన పంట."
- ధాన్‌వాలే బాబా