Kolkata Doctors Strike :కోల్‌కతా ఆర్జీ కర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై నిరసనలు చేస్తున్న డాక్టర్లు, బంగాల్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. తమ డిమాండ్లను 24 గంటల లోపు నేరవేర్చాలని, లేకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని శుక్రవారం సాయంత్రం హెచ్చరించారు. తమ డిమాండ్లు చాలా సులభమైనవి అన్న డాక్టర్లు, ఆస్పత్రుల్లో భద్రత పెంచడానికి ప్రభుత్వానికి సమయం ఇచ్చామన్నారు. అయినా అలా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. తాము ఇచ్చిన దాంట్లో కొన్నే నెరవేర్చామని సుప్రీం కోర్టు ముందు ప్రభుత్వమే స్వయంగా ఒప్పుకుందని అన్నారు. అంతేకాకుండా చర్చలకు బంగాల్ ప్రభుత్వం విముఖత చూపుతోందని ఆరోపించారు.
"ఈరోజు(శుక్రవారం) దాదాపు రాత్రి 8.30 గంటల సమయంలో విధుల బహిష్కరణ విరమించాము. అయితే, మా డిమాండ్లపై ప్రభుత్వం ఏవైనా చర్యలు తీసుకుంటుందో లేదో చూడటానికి శనివారం ఇదే సమయం వరకు వేచి చూస్తాము." అని ఆందోళన చేస్తున్న వైద్యుడొకరు తెలిపారు.
మాతో ఎవరూ లేరని అనుకుంటే పొరపాటే : డాక్టర్లు
'మేము పూర్తి విధుల బహిష్కరణ విరమించుకొని తిరిగి ఆస్పత్రుల్లో సేవలందించేందుకు వస్తున్నాము. అయితే మా నిరసనను కొనసాగిస్తాము. మా డిమాండ్లను నెరవేర్చడానికి ప్రభుత్వానికి 24 గంటల సమయం ఇస్తున్నాము. లేకుంటే మేము ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభిస్తాము." అని కోల్‌కతా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి చెందిన డాక్టర్ దేబాసిశ్ హల్డర్ చెప్పారు. విధులకు తిరిగి వస్తున్నంత మాత్రాన ఆందోళన విరమిస్తున్నామని ప్రభుత్వం భావించకూడదన్నారు. తమతో ఎవరూ లేరని భావిస్తే ప్రభుత్వం పొరపడుతున్నట్లని, తమకు సామాన్య ప్రజల పూర్తి మద్దతు ఉందన్నారు దేబాసిశ్ హల్డర్ .
పెద్ద గడియారం దానికి సంకేతం!
వర్షం సైతం లెక్కచేయకుండా శుక్రవారం వైద్యులు నిరసన తెలియజేశారు. బెద్ద గడియారం ప్రదర్శిస్తూ తమ డిమాండ్లను మరో సారి చెప్పారు. బంగాల్లోని అన్ని వైద్య కళాశాలల్లో బెదిరింపులకు పాల్పడిన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడానికి కేంద్ర విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. " డొరినా క్రాసింగ్‌లో మేము నిరసన చేస్తున్నాము. ఇంకా పెద్ద ప్రదర్శన కోసం ప్లాన్ చేస్తున్నాము. మేము అటు విధులు నిర్వర్తిస్తూనే, ఇటు నిరసన తెలియజేస్తాము. మా నిరసనలో ప్రతి నిమిషం, ప్రతి గంటను ట్రాక్ చేయడానికి ఈ పెద్ద గడియారం ప్రదర్శిస్తున్నాము." అని దేబాసిశ్ తెలిపారు.