Kerala landslides: కేరళలో భారీ వర్షాలు విలయాన్ని సృష్టించాయి. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడడం వల్ల వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది శిథిలాల్లో చిక్కుకుపోయారు. మరికొంత మంది ఆచూకీ లేకుండా పోయింది. ఇంతటి భారీ విషాదానికి దారితీయడానికి అరేబియా సముద్రం వేడెక్కడమూ ఓ కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. అరేబియా సముద్రంలో ఈ తరహా దట్టమైన మేఘాల ధోరణిని ముందుగానే గుర్తించినట్లు పేర్కొంటున్నారు.
రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో 24 గంటల వ్యవధిలో 10 సెం.మీ వర్షపాతం నమోదైంది. కొట్టాయం తదితర జిల్లాల్లో 8 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. గత రెండు వారాలుగా కొంకణ్ ప్రాంతంలో రుతుపవనాలు చురుకుగా ఉండటం, ఉపరితల ద్రోణి కారణంగా కాసర్‌గోడ్, కన్నూర్, వయనాడ్, కొయ్‌కోడ్, మలప్పురం జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతోందని కొచ్చి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన రాడార్ పరిశోధన కేంద్రం డైరెక్టర్ అభిలాష్ పేర్కొన్నారు.
2019 మాదిరిగానే
'రెండు వారాలుగా కురస్తున్న ఈ భారీ వర్షాలతో నేల మొత్తం తేమగా మారింది. ఇదే సమయంలో వేడిగాలుల కారణంగా అరేబియా తీరంలో దట్టమైన మేఘాల వ్యవస్థ ఏర్పడింది. సుదీర్ఘ సమయం పాటు ఉరుములు, మెరుపులతో కూడిన ఈ మేఘాల కారణంగా వయనాడ్, కొలికోడ్, మలప్పురం, కన్నూర్‌లలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో కొండచరియలు విరిగిపడ్డాయి. అరేబియా సముద్ర తీరంలో ఈ తరహా ధోరణిని ముందుగానే గుర్తించారు. ఆగ్నేయ అరేబియా వేడెక్కుతుంది. దీంతో కేరళ సహా ఈ ప్రాంతం ఉష్ణగతికంగా అస్థిరమైందిగా మారినట్లు మా పరిశోధనలో తేలింది. ఇలా వాతావరణంలో అస్థిరతే దట్టమైన మేఘాలు ఏర్పడటానికి కారణం. ఈ రకమైన వర్షపాతం గతంలో ఉత్తర కొంకణ్ ప్రాంతంలో సాధారణంగా కనిపించేదన్నారు. 2019లో రాష్ట్రంలో వరదలకు కారణమైన దట్టమైన మేఘాల మాదిరిగానే ఇవి ఉన్నాయి' అని అభిలాష్ వెల్లడించారు.