Karnataka HC on Marriage : దంపతుల మధ్య సాన్నిహిత్యాన్ని ఒక ఫొటో ఆధారంగా నిర్ధరించలేమని కర్ణాటక హైకోర్టు అభిప్రాయపడింది. తమకూరుకు చెందిన మహిళ విడాకుల పిటిషన్పై దర్యాప్తు జరిపిన జస్టిస్ శివరామన్, జస్టిస్ అనంత రామనాథ హెగ్డేతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లి వేడుకలో పాల్గొన్న దంపతులు ఫొటో దిగినంత మాత్రాన వారి మధ్య బంధం బాగానే ఉందని అర్థం కాదని ధర్మాసనం పేర్కొంది. ఫొటోను బట్టి దంపతుల మధ్య ఉన్న సంబంధాలపై స్పష్టతకు రావడం కుదరదని స్పష్టం చేసింది. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ మహిళకు తన భర్తతో విడాకులు మంజూరు చేసింది హైకోర్టు.
"తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త ఆరోపించాడు. దీనికి సంబంధించిన ఆధారాలు అతడు సమర్పించలేదు. ఇలాంటి ఆరోపణ చేయడం క్రూరత్వంతో సమానం. దంపతుల మధ్య పరస్పర విశ్వాసం, ప్రేమ, గౌరవం ఆధారంగా వివాహ వ్యవస్థ కొనసాగుతుంది. దంపతుల్లో ఒకరు ఇంకొకరి ప్రవర్తనను అనుమానించి, దానిని నిరూపించకపోతే అలాంటి ఆరోపణ నిరాధారమైనది. ఈ ఆరోపణలు వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. అలాంటప్పుడు భార్య తన వైవాహిక జీవితాన్ని ప్రశాంతంగా కొనసాగించలేదు. అందుకే భర్త నుంచి మహిళకు విడాకులు మంజూరు చేస్తున్నాం." అని కర్ణాటక హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అసలేంటీ కేసు?
పిటిషనర్ (విడాకులు కోరుతున్న మహిళ)కు 2008 నుంచి ఓ వ్యక్తితో పరిచయం ఉంది. ఆ తర్వాత వీరిద్దరూ 2013లో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సదరు మహిళ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. రెండేళ్లపాటు సాఫీగా సాగిన వీరి కాపురంలో అకస్మాత్తుగా విభేదాలు మొదలయ్యాయి. తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త ఆరోపించాడు. ఆమె ఫోన్ కాల్స్ చెక్ చేసేవాడు. మహిళపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో 2017లో మహిళ భర్తను వదిలిపెట్టి బెంగళూరులోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఫ్యామిలీ కోర్టులో విడాకులు కోసం దరఖాస్తు చేసుకుంది. తనను భర్త చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, అలాగే హత్య చేసేందుకు యత్నించాడని మహిళ విడాకుల పిటిషన్ లో పేర్కొంది.