Kamalnath Quits Congress :సార్వత్రిక ఎన్నికలకు ముందు మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో సీనియర్ నేతలు వరుసగా కాంగ్రెస్‌ను వీడిన వేళ, మధ్యప్రదేశ్‌లోనూ ఆ పార్టీకి గట్టిదెబ్బ తగలనున్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ మాజీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్, ఆయన కుమారుడు, ఎంపీ నకుల్‌నాథ్ బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 19న వారిద్దరూ బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాల పట్ల సంతోషంగా లేనట్లు కమల్‌నాథ్ పేర్కొన్నారని ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి. బీజేపీలో చేరే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నాయి.
కాంగ్రెస్ పార్టీని వీడనున్నారని ప్రచారం జరుగుతున్న వేళ దిల్లీ వెళ్లిన కమల్‌నాథ్, బీజేపీలో చేరిక అంశంపై మీడియా అడిగిన ప్రశ్నలకు సూటిగా చెప్పకుండా సమాధానం దాటవేశారు. అంతకుముందు ఆయన కుమారుడు, ఎంపీ నకుల్‌నాథ్ తన సోషల్ మీడియా ఖాతాల బయోల్లో కాంగ్రెస్ పేరు తొలగించారు. దీంతో కమల్‌నాథ్, ఆయన కుమారుడు హస్తం పార్టీని వీడనున్నారనే ప్రచారానికి మరింత బలం చేకూర్చింది.
"అలాంటి విషయం ఏదైనా ఉంటే మీకే (పాత్రికేయులకు) అందరికంటే ముందు చెబుతా. విషయం తిరస్కరించటం కాదు. ఆ మాట మీరు (పాత్రికేయులు) అంటున్నారు. మీరు(పాత్రికేయులు) ఉత్సాహం చూపుతున్నారు. నాకు ఆ వైపు లేదా ఈ వైపు ఉత్సాహం లేదు. అయితే విషయం ఏమంటే అలాంటి విషయం ఏమైనా ఉంటే మీకే (పాత్రికేయులు) అందరికంటే ముందు చెబుతా."
-కమల్‌నాథ్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం
ఖండించిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్
కమల్‌నాథ్, ఆయన కుమారుడు నకుల్‌నాథ్ బీజేపీలో చేరుతారన్న ఊహాగానాలను మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితు పట్వారీ తోసిపుచ్చారు. ఇందిరా గాంధీ మూడో కుమారుడు (కమల్‌నాథ్‌ను ఉద్దేశించి) ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ వీడుతారా? అని అన్నారు. 'జనతా పార్టీ ఇందిరా గాంధీని జైలుకు పంపినప్పుడు తన రాజకీయ యాత్రను ప్రారంభించారు కమల్ నాథ్. నెహ్రూ-గాంధీ కుటుంబానికి అండగా నిలిచారు ఆయన. అలాంటి వ్యక్తి కాంగ్రెస్‌ను, గాంధీ కుటుంబాన్ని విడిచిపెడతాడని అనుకుంటున్నారా?' అని తెలిపారు. అలాగే కమల్‌నాథ్ బీజేపీలో చేరుతారన్న వార్తలను కొట్టిపారేశారు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్. అదంతా మీడియా సృష్టి అన్నారు.