Junior Doctors Rally Kolkata : కోల్‌కతా జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. బాధితురాలికి న్యాయం చేయాలని, నగర సీపీ వినీత్ గోయల్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు లాల్ బజార్‌లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ వద్దకు ధర్నాగా వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు అప్రమత్తమై వీరిని అడ్డుకున్నారు. దీంతో జూనియర్ డాక్టర్లు బీబీ గంగూలీ వీధిలో గత 12 గంటల నుంచి శాంతియుత నిరసన చేపడుతున్నారు. సోమవారం రాత్రంతా రోడ్డుపైనే గడిపారు. సీపీకి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని ఆందోళనలు చేస్తున్నారు.
అర కిలోమీటర్ మేర నిరసనకారులు
సోమవారం మధ్యాహ్నం మొదలైన ధర్నా మంగళవారం ఉదయం కూడా కొనసాగుతోంది. వివిధ వైద్య కళాశాలలకు చెందిన జూనియర్ డాక్టర్లు చేపట్టిన ఈ ధర్నాలో సామాన్యులు, ఇతర విద్యా సంస్థల విద్యార్థులు సైతం చేరారు. దీంతో లాల్ బజార్ నుంచి అర కిలోమీటరు దూరంలో ఉన్న బీబీ గంగూలీ వీధి వరకు జనసమూహం ఏర్పడింది. వీరందరూ సోమవారం రాత్రంతా శాంతియుత నిరసన చేపట్టారు. వైద్యులకు రక్షణ కల్పించాలని నినాదాలు చేశారు.
బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు
కాగా, ధర్నా చేసేందుకు వచ్చినవారికి కట్టడి చేసేందుకు కోల్‌కతా పోలీసులు భారీ బారికేడ్లను ఏర్పాటు చేశారు. అలాగే గొలుసులతో దారిని మూసేశారు. మరోవైపు, జూనియర్ డాక్టర్లు బారికేడ్‌పై ఫొటో, ఎర్ర గులాబీలను ఉంచి నిరసన తెలియజేశారు. "కోల్‌కతా పోలీసులు మమ్మల్ని ఆపడానికి 9 అడుగుల ఎత్తైన బారికేడ్‌ను వేస్తారని మాకు తెలియదు. లాల్ బజార్‌కు చేరుకుని సీపీని కలిసే వరకు మా ఆందోళన కొనసాగుతోంది. అప్పటి వరకు ఇక్కడే కూర్చుంటాం" అని నిరసనల్లో పాల్గొన్న ఓ జూనియర్ వైద్యురాలు తెలిపారు.