JDU On Agnipath Scheme : కేంద్రంలో మూడోసారి టీడీపీ, జేడీయూ మద్దతుతో ఏర్పాటు చేయబోతున్న బీజేపీకి బిహార్ సీఎం నీతీశ్ కుమార్ పార్టీ నుంచి అప్పుడే భారీ డిమాండ్లు మొదలయ్యాయి! అగ్నిపథ్ పథకాన్ని సమీక్షించాలని జేడీయూ నేత కేసీ త్యాగి అన్నారు. ఆ స్కీమ్‌ను చాలా మంది వ్యతిరేకించారని చెప్పారు. ఎన్నికల్లో దాని ప్రభావం పడిందని తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో కేసీ త్యాగి ఈ వ్యాఖ్యలు చేశారు.
"అగ్నివీర్ పథకంపై ప్రజలకు అభ్యంతరాలు ఉన్నాయి. ఈ స్కీమ్‌ను తీసుకొచ్చినప్పుడే సాయుధ దళాలకు చెందిన కుటుంబాలు వ్యతిరేకించాయి. దీనిపై చర్చించాల్సిన అవసరం ఉంది. ఎన్నికల వేళ ఆయా కుటుంబాలు నిరసనలు తెలియజేశారు" అని త్యాగి గుర్తు చేశారు. యూనిఫాం సివిల్ కోడ్‌కు జేడీయూ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కానీ వివిధ పార్టీల నేతలను సంప్రదించి తీర్మానం చేయాలని కోరారు. దీంతో పాటు బిహార్‌కు ప్రత్యేక హోదా, దేశవ్యాప్త కులగణన వంటి అంశాలపైనా జేడీయూ తన డిమాండ్లను బీజేపీ అధిష్ఠానం ముందు ఉంచినట్లు సమాచారం.
మోదీ కూడా వ్యతిరేకించలేదు!
దేశంలోని ఏ పార్టీ కూడా కులగణనను వ్యతిరేకించలేదని కేసీ త్యాగి తెలిపారు. ఈ విషయంలో బిహార్ అన్ని రాష్ట్రాలకు మార్గం చూపిందని చెప్పారు. ప్రధాని కూడా వ్యతిరేకించలేదని, కులగణన అవసరమని వెల్లడించారు. దానిని భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్తామని పరోక్షంగా తెలిపారు. బిహార్‌కు ప్రత్యేక హోదా దక్కాలనేది తమ హృదయాల్లో ఎప్పటికీ ఉంటుందని స్పష్టం చేశారు.
మోదీ ప్రమాణ స్వీకారం టైమ్ ఫిక్స్!
మరోవైపు, వరుసగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ జూన్ 9న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆదివారం సాయంత్రం 6 గంటలకు మోదీ ప్రమాణ స్వీకారోత్సవం జరగవచ్చని చెప్పాయి. అయితే మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జూన్ 8వ తేదీన జరుగుతుందని ఊహాగానాలు వచ్చాయి. కానీ తొమ్మిదో తేదీనే జరగనున్నట్లు సమాచారం.
అతిథులుగా విదేశీ నేతలు!
2014లో మోదీ మొదటిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో సార్క్(SAARC) దేశాల అధినేతలు హాజరయ్యారు. 2019లో బిమ్స్‌టెక్ (BIMSTEC) దేశాల నాయకులు ప్రమాణస్వీకారానికి వచ్చారు. ఈసారి బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్ సహా పలు దేశాల అధినేతలు రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమకు ఆహ్వానం అందినట్లు శ్రీలంక అధ్యక్షుడి మీడియా కార్యాలయం తెలిపింది.