Jayanthi Buruda in Forbes India 2024 : ఫోర్బ్స్ ప్రచురించిన అత్యంత శక్తిమంతమైన మహిళలల్లో ఈ ఏడాది ఒడిశాకు చెందిన గిరిజన మహిళా జర్నలిస్ట్ స్థానం సంపాదించారు. ఈమె గిరిజన బాలికలకు విద్య, ఆరోగ్యంపై చైత్యనం కల్పిస్తున్నారు. అలాగే మహిళల రుతుక్రమ సమయంలో పరిశుభ్రత, శానిటరీ ప్యాడ్లను ఉపయోగించేలా అవగాహన కల్పిస్తున్నారు. దీంతో ఇండియాలోనే అత్యంత శక్తిమంతమైన 23 మంది మహిళల్లో స్థానం దక్కించుకున్నారు. ఆమె మల్కన్‌గిరి జిల్లాకు చెందిన జయంతి బురుడా.
స్నేహితుల ఆర్థిక సాయంతో
గిరిజన అమ్మాయిల్లో చదువుకుని జర్నలిస్ట్‌గా మారిన మొదటి మహిళ జయంతి బురుడా. జర్నలిస్ట్‌గా మారి గిరిజన మహిళలకు సాయం చేయాలని జయంతి నిర్ణయించుకున్నారు ఆమె. కానీ తన తల్లిదండ్రులు అందుకు అంగీకరించకోపోవడం వల్ల ఇంటిని సైతం విడిచి పెట్టి వెళ్లిపోయారు. ఆ తర్వాత స్నేహితుల ఆర్థిక సహాయంతో ఒడిశాలోని కోరాపుట్ సెంట్రల్ యూనివర్సిటీ డిగ్రీని పూర్తి చేశారు. ఆ సమయంలోనే మావోయిస్టుల కార్యకలాపాలతో పాటు గిరిజన మహిళలకు పడుతున్న కష్టాలను ఇలా పలు అంశాలను వెలుగులో తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం 2015లో ఒక టెలివిజన్ ఛానెల్లో జిల్లా కరస్పాండెంట్‌గా చేరారు.
గిరిజనుల కోసం సంస్థ ఏర్పాటు
మల్కన్‌గిరి జిల్లాలోని గిరిజన బాలికల విద్య, ఆరోగ్యంపై ఇలా పలు అంశాలపై అవగాహన కల్పించేందుకు 2018లో 'జంగిల్ రాణి బడా దీదీ' అనే సంస్థను స్థాపించారు జయంతి. 'ఆశ్రమ పాఠశాల్లో ఎక్కువ టీనేజ్ బాలికలు గర్భం ధరించడం నేను చూశాను. ఆదివాసీ మహిళలు ఇలాంటి సమస్యల గురించి మాట్లాడలేకపోతున్నారు. అందుకే నేను వారి కష్టాలను వెలుగులోకి తీసుకురావాలి అనుకున్నా. అలాగే ఆరోగ్యం, విద్య, పరిశుభ్రత వంటి వాటిపై అవగాహన కల్పించేందుకు ఈ సంస్థను ప్రారంభించాను' అని జయంతి తెలిపారు.