Jammu Kashmir Terror Attack :జమ్ముకశ్మీర్ రియాసీ జిల్లాలో యాత్రికుల బస్సుపై జరిగిన దాడికి పాకిస్థాన్ నుంచి కార్యకలాపాలు నిర్వహించే ద రెసిస్టెంట్ ఫ్రంట్ ఉగ్రసంస్థ బాధ్యత వహించింది. కశ్మీర్ ప్రాంతంలో అలాంటి ఉగ్రదాడులు మరిన్ని చేస్తామని ముష్కర సంస్థ హెచ్చరించింది. పర్యాటకులు, స్థానికేతరులే లక్ష్యంగా దాడులకు తెగబడతామని చెప్పి టీఆర్ఎఫ్, ఇది ఆరంభం మాత్రమేనని ప్రకటించింది. ఉగ్రదాడి నేపథ్యంలో రియాసీలో హై అలెర్ట్ కొనసాగుతోంది. ఈ దాడికి తెగబడ్డ ముష్కరులను పట్టుకోవడానికి సైన్యం, సీఆర్పీఎఫ్, పోలీసు బలగాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. భారీగా రంగంలోకి దిగిన సైన్యం డ్రోన్లతో ముష్కర వేట ముమ్మరం చేసింది. మరోవైపు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA) బృందం రియాసీ ప్రాంతాన్ని చేరుకుంది. సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న పోలీసులతో కలిసి దర్యాప్తును ప్రారంభించింది.
రూ. 10లక్షలు ఎక్స్‌గ్రేషియా
ఈ దాడిలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తామని జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం ఇస్తామని తెలిపారు.
ఇదీ జరిగింది
వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించి మరో మందిరానికి వెళ్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన యాత్రికుల బస్సుపై ఆదివారం సాయంత్రం ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఫలితంగా అదుపు తప్పిన బస్సు లోయలో పడి 9మంది ప్రాణాలు కోల్పోయారు. 41మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయ చర్యల్లో పాల్గొన్నారు. 9 మంది మృతదేహాలను వెలికితీసినట్లు రియాసీ జిల్లా సీనియర్ ఎస్పీ మోహితా శర్మ తెలిపారు. గాయపడినవారిని వివిధ ఆసుపత్రులకు తరలించినట్లు వివరించారు. మృతులంతా ఉత్తర్‌ప్రదేశ్ వాసులని భావిస్తున్నారు. పరిస్థితిని సమీక్షించిన ప్రధాని మోదీ దాడిలో హస్తమున్న ప్రతీ ఒక్కరికి శిక్షపడుతుందని హెచ్చరించినట్లు ఎల్జీ కార్యాలయం తెలిపింది. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, కేంద్ర మంత్రి అమిత్ షా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ దాడిని ఖండించారు.
ప్రధాని అయ్యాక మోదీ ఫస్ట్ సంతకం- వారందరి ఖాతాల్లోకి డబ్బులే డబ్బులు! - Modi First Signature
'మార్కులు తగ్గితే తాతతో కలిసి అలా చేసేవాడిని'- JEE అడ్వాన్స్డ్ టాపర్ సీక్రెట్ ఇదే! - JEE Advanced Topper 2024