Iron Dosa Tawa Cleaning Tips:దోశ, పరాటా, చపాతీ.. మొదలైనవి అన్నీ పెనం మీదనే చేసుకుంటుంటాం. చాలా మంది వీటి కోసం ఐరన్ పాన్స్ ఉపయోగిస్తుంటారు. అయితే.. వాటిని యూజ్ చేసిన తర్వాత మెయింటెనెన్స్ విషయంలో కాస్త నిర్లక్ష్యం వహిస్తారు. దీంతో అవి కాలక్రమేణా నల్లగా మారడం, తుప్పు పట్డడం వంటివి జరుగుతుంటాయి. దీంతో వాటిని వాడలేక.. కొత్తవి కొంటుంటారు. అయితే.. కొత్తవి కొనాల్సిన అవసరం లేకుండా.. నల్లగా మారిన, తుప్పు పట్టిన ఐరన్ పెనాన్ని క్లీన్ చేయడానికి కొన్ని టిప్స్ ఉన్నాయని నిపుణులు అంటున్నారు. పైగా వీటికి పెద్ద ఖర్చు కూడా కాదంటున్నారు. ఈ టిప్స్ పాటించి క్లీన్ చేస్తే నల్లగా మారిన పాన్ కొత్తదానిలా నిగనిగలాడుతూ కనిపిస్తుందని చెబుతున్నారు. ఈ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
దోశ పెనం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలంటే వాడిన వెంటనే శుభ్రపరచడం మొదట చేయాల్సిన పని అని నిపుణులు అంటున్నారు. అయితే.. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. పెనం కొద్దిగా చల్లారిన తర్వాత క్లీన్ చేయాలి. దానిపై ఉన్న పిండి అవశేషాలు గట్టిపడేవరకు చూడవద్దు. అదే విధంగా పాన్ శుభ్రం చేయడానికి మృదువైన స్పాంజ్ యూజ్ చేయాలి. గరుకుగా ఉన్నవి వాడితే పెనం ఉపరితలం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇంత చేసినా నల్లగా అయ్యిందంటే ఈ టిప్స్ పాటిస్తే సరి..
షాంపూ:నల్లగా ఉన్న పాన్‌ను శుభ్రం చేయడానికి నిమ్మకాయ, ఉప్పు, కొద్దిగా షాంపూ అవసరం అవుతాయని నిపుణులు అంటున్నారు. ముందుగా పాన్‌ను స్టౌ మీద పెట్టి వేడి చేయాలి. పాన్ వేడెక్కాక స్టవ్ ఆఫ్ చేసి దాని మీద షాంపూ వేసి దానిలో ఒక చెంచా ఉప్పు, కొద్దిగా నిమ్మరసం కూడా వేసి పాన్ అంతా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు నిమ్మతొక్కలతో పాన్ అంతా రుద్దాలి. ఇలా చేయడం వల్ల పెనం మీద పేరుకుపోయిన నూనె, మురికి క్లీన్ అవుతాయి.ఇలా చేసిన తరువాత పాన్‌ను సాధారణ డిష్ వాష్ లిక్విడ్‌తో కడగాలి. ఇలా చేస్తే పాన్ పూర్తిగా శుభ్రమై కొత్తదానిలా మెరుస్తుంది.