Husband kept Wife In House Arrest : కట్టుకున్న భార్యపట్ల అమానవీయంగా ప్రవర్తించాడో భర్త. లేనిపోని అనుమానాలతో ఆమెను గృహ నిర్బంధంలో ఉంచాడు. కనీసం మరుగుదొడ్డి లేని ఓ గదిలో ఉంచి తాళం వేశాడు. తన పిల్లలను కూడా కలవనివ్వలేదు. గత కొన్నేళ్లుగా భార్యను నిర్బంధించి పైశాచిక ఆనందం పొందుతున్నాడు. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగిందంటే?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మైసూరు జిల్లాలోని ఒక గ్రామంలో సునలయ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతడికి బాధితురాలు మూడో భార్య. నిందుతుడికి మొదట రెండు పెళ్లిళ్లు అయ్యాయి. కానీ అతడి వేధింపులకు తాళలేక వారిద్దరూ వదిలేసి వెళ్లిపోయారు. దీంతో మూడో వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే మూడో భార్యను మొదటి నుంచి అనుమానించడం, వేధించడం, మొదలుపెట్టాడు. చివరకు ఇంట్లోనే ఓ గదిలో ఆమెను బంధించాడు. కిటికీలన్నీ మూసి బయటఎవ్వరితోనూ మాట్లాడనివ్వలేదు. అంతేకాకుండా మరుగుదొడ్డి లేని ఇంట్లో రాత్రి పూట బకెట్‌తో మలమూత్రాలు శుభ్రం చేసేవాడు.
అయితే ఈ విషయంపై గ్రామ పెద్దలు పలుమార్లు నిందితుడిని పిలిపించి మాట్లాడారు. అయినా సునలయ తన తప్పు సరిదిద్దుకోలేదు. అలాగే భార్యను నిర్బంధంలో ఉంచి చిత్ర హింసలు చేశాడు. అయితే చాలా కాలంగా జరుగుతున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ అమానవీయ ఘటనపై సమాచారం అందుకున్న న్యాయవాది సిద్దప్పాజీ, కన్సోలేషన్ కేంద్రం సిబ్బంది, ఏఎస్సై బాధితురాలి ఇంటికి వెళ్లారు. తాళం బద్దలుగొట్టి బాధితురాలిని, ఆమె పిల్లలను రక్షించారు. ఆమె అంగీకారం మేరకు తన తల్లి ఇంట్లో ఆశ్రయం కల్పించారు. సునలయను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.